ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ నాలుగైదు వారాల పాటు ఈ మూవీ గురించి పాజిటివ్ గానో, నెగెటివ్ గానూ మాట్లాడని సినిమా వ్యక్తులు లేరంటే అతిశయోక్తి కాదు. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోని హిందూ పండిట్ల మీద జరిగిన దాడి, దాంతో వారు కశ్మీర్ లోయను వదిలి దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన సంఘటనలు, వాటిని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్న వామపక్షీయుల చర్యలను ఈ చిత్రంలో వివేక్ అగ్నిహోత్రి కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఇప్పుడీ సినిమాను మే 13న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు జీ 5 సంస్థ తెలిపింది.
ఇదిలా ఉంటే… ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇటీవలే వివేశ్ అగ్నిహోత్రితో కలిసి ‘ద ఢిల్లీ ఫైల్స్’ మూవీని నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. అలానే తెలుగులో ఆయన పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. అందులో ఒకటి రవితేజాతో నిర్మిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమా తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయిన నేపథ్యంలో దర్శకుడు వంశీకృష్ణతో కలిసి అభిషేక్ అగర్వాల్ శ్రీశైల మల్లన్నను ఆదివారం దర్శించుకున్నారు.