అద్భుతాలు అనుకుంటే జరగవు. అవి సంభవించాలి. అలాంటి అద్భుతం ‘బాహుబలి’ విషయంలో సంభవించింది. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’ విషయంలో జరుగుతుందనిపిస్తోంది. భారతీయ సినిమా కలెక్షన్లను గురించి చెప్పే సందర్భాలలో ‘నాన్ బాహుబలి’ అని స్పెషల్ గా మెన్షన్ చేయడం మనం చూస్తున్నాం. ఇక మార్చి 25వ తేదీన అది ‘నాన్ ట్రిపుల్ ఆర్’ కలెక్షన్స్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను వసూలు చేసి ‘బాహుబలి -2’ ఆల్ ఇండియా టాప్ ట్రాసర్స్ లో అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పుడీ రికార్డ్ ను ‘ట్రిపుల్ ఆర్’ మూవీ తిరగరాస్తుందనే నమ్మకం కోట్లాదిమంది అభిమానుల్లో ఉంది. అదే జరిగితే… ఓ తెలుగు సినిమా మరోసారి ‘ట్రిపుల్ ఆర్’ రూపంలో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీని తిరగరాసినట్టే!
రియల్ మల్టీస్టారర్!
ఇద్దరు హీరోలు కలసి నటించిన సినిమా చేస్తే చాలు మల్టీస్టారర్ మూవీ అని చెప్పుకుంటున్న రోజులివి. కానీ ఒకేస్థాయి, ఒకే ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలసి నటిస్తేనే రియల్ మల్టీస్టారర్ అవుతుంది. అలా ఈ మధ్యకాలంలో తెలుగులో వస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళికి కథలు అందించే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మదిలో మెదిలిన ఓ చిన్న ఫ్లాష్ లాంటి ఆలోచన ‘ట్రిపుల్ ఆర్’కు నాంది పలికింది. దాదాపు ఒకే సమయంలో జీవించిన అల్లూరి సీతారామరాజు, కొమరమ్ భీమ్ సాటివారి స్వేచ్ఛ అనే లక్ష్యం కోసం తమ ప్రాణాలను ఒడ్డారు. కొమరం భీమ్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడితే, అల్లూరి సీతారామరాజు బ్రిటీషర్స్ తో యుద్ధం చేశాడు. జీవితంలో ఒక్కసారి కూడా తారసపడని ఈ వీరులు కలిస్తే ఎలా ఉండేదన్న ఊహకు వెండితెర రూపమే ‘ట్రిపుల్ ఆర్’. విజయేంద్ర ప్రసాద్ అందించిన మూలకథను తనకు అనుకూలంగా విస్తరింపచేశారు రాజమౌళి. అప్పటికే తనతో సినిమాలు చేసిన యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లను ఇందులో ‘భీమ్ – రామ్’ పాత్రలకు ఎంపిక చేసుకున్నారు.
సోషల్ మీడియాలో ఒకే ఒక్క ఫోటోతో సంచలనం!
2017 నవంబర్ లో ఇటు ఎన్టీయార్, అటు రామ్ చరణ్ లను పక్కన పెట్టుకుని ఓ ఫోటో దిగారు రాజమౌళి. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘బాహుబలి -2’ తర్వాత తాను చేయబోతున్న చిత్రం ఈ ఇద్దరితోనే అని రాజమౌళి చెప్పకనే చెప్పారు. ఇది జరిగిన ఐదు నెలలకు ‘ట్రిపుల్ ఆర్ ‘ టైటిల్ ను ప్రకటించడంతో పాటు మార్చి 2018న ఆ ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేశారు. ‘ట్రిపుల్ ఆర్’ అనే టెంటెటివ్ టైటిల్ కు అప్పుడు చెప్పిన అర్థం రాజమౌళి, రామ్ చరణ్, రామారావు! అని. అయితే ఆ పేరుకు విశేషమైన ప్రాచుర్యం దక్కడంతో ఇక అదే పేరును ఆ తర్వాత ఖరారు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ‘ట్రిపుల్ ఆర్’ అబ్రివేషన్ ను ‘రౌద్రం రణం రుధిరం’గా మార్చారు. ఈ సినిమా ప్రారంభోత్సవం 2018 నవంబర్ 11న గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత నవంబర్ 19న అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన స్పెషల్ సెట్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు రాజమౌళి.
విగరస్ గా ఫిజికల్ ట్రైనింగ్!
1920 నాటి స్వాతంత్ర సంగ్రామం నేపథ్యం కావడంతో పాటు రామ్ చరణ్ అల్లూరిగా, ఎన్టీయార్ కొమరం భీమ్ గా కనిపించాలి. దాంతో షూటింగ్ కు చాలా రోజుల ముందు నుండే విగరస్ గా వీరిద్దరికీ ఫిజికల్ ట్రైనింగ్ ఇప్పించారు రాజమౌళి. తాను అనుకున్న విధంగా బాడీ ఫిట్ నెస్ ను పొందిన తర్వాతే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను ఎంపిక చేశారు. ఎన్టీయార్ పక్కన డైసీ ఎడ్గార్ జోన్స్ ను తీసుకున్నారు. కానీ ఆమె ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ఒలివియా మోరిస్ కు దక్కింది. ఇక అజయ్ దేవ్ గణ్, శ్రియా సైతం ఇందులో గెస్ట్ రోల్స్ కు కాస్తంత ఎక్కువైన కీలక పాత్రలకు ఎంపికయ్యారు. మలయాళ చిత్రం ‘దృశ్యం’ హిందీ రీమేక్ తర్వాత వీరిద్దరూ జోడీ కట్టడం మళ్ళీ ఇదే. వీరితో పాటు సముతిర ఖని, రాజీవ్ కనకాల, రే స్టీవెన్ సన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం ఒక్కసారిగా నెపోటిజమ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అవి అలియా భట్ నూ బాగానే తాకాయి. దాంతో ఆమెను ‘ట్రిపుల్ ఆర్’ నుండి తొలగించమంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే వాటిని పట్టించుకోకుండా ఆమెతోనే ఇందులోని సీత పాత్ర చేయించారు రాజమౌళి. అలా డిసెంబర్ 2020లో షూటింగ్ లో పాల్గొని తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టింది అలియా భట్.
ఉక్రెయిన్ లోనూ జరిగిన షూటింగ్!
‘ట్రిపుల్ ఆర్’ మూవీ పిరియడ్ యాక్షన్ డ్రామా కావడంతో భారీ సెట్స్ వేయడమే కాదు… సహజత్వం కోసం వివిధ దేశాలలోనూ షూటింగ్ చేశారు. అరకు- పాడేరుతో పాటు వికారాబాద్ ఫారెస్ట్ లోనూ షూటింగ్ జరిపారు. అలానే అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలోనూ భారీ సెట్స్ వేశారు. అదే తీరున భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ కోసం ఉక్రెయిన్, బల్గేరియా దేశాలకు వెళ్ళారు. ఎన్టీయార్, రామ్ చరణ్ పై ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో ‘నాటు… నాటు’ పాటను ఉక్రెయిన్ లోనే చిత్రీకరించారు. ప్రస్తుతం యుద్ధోన్మాది రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్ ను తలుచుకుంటోంది ‘ట్రిపుల్ ఆర్’ బృందం. ఉక్రెయిన్ లోని కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రజలు చూపించిన ఆదరణను అంత తేలిగ్గా మర్చిపోలేమని చెబుతోంది. కరోనా కారణంగానే కాదు యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ సమయంలోనూ ఇద్దరు హీరోలు గాయపడటంతోనూ కొన్ని షెడ్యూల్స్ రద్దు అయ్యాయి. అయితే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు.
విశేషం ఏమంటే ఈ సినిమా కోసం దాదాపు 60, 70 రోజుల పాటు రాత్రి షూటింగ్ చేశారు. ఆరీ అలెక్సా ఎల్ఎఫ్ , ఆరీ సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ ను ఉపయోగిస్తూ షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘ట్రిపుల్ ఆర్’ నిలువబోతోంది. అలానే యాక్షన్ డైరెక్టర్ నిక్ పోవెల్ నిర్దేశకత్వంలో క్లయిమాక్స్ లోని కొన్ని వార్ సీన్స్ ను అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఇవన్నీ గూజ్ బంబ్స్ కలిగించేవే. సాయి మాధవ్ బుర్రా రాసిన సంభాషణలు, కీరవాణి నేపథ్య సంగీతం, స్వరపర్చిన బాణీలు, సెంథిల్ సినిమాటోగ్రఫీ ప్రతిభ, శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్, ఎ. శ్రీనివాస మోహన్ నేతృత్వంలో జరిగి వి.ఎఫ్.ఎక్స్., రమా రాజమౌళి సమకూర్చిన కాస్ట్యూమ్స్… ఇలా ప్రతి ఒక్క విభాగం నుండి ‘ద బెస్ట్’ అవుట్ పుట్ ను తీసుకున్నారు రాజమౌళి. వీరందరినీ సాబు సిరిల్ ప్రొడక్షన్ సూపర్ వైజర్ గా కో-ఆర్డినేట్ చేశారు.
భారీగా పెరిగిన బడ్జెట్!
ఎన్టీయార్, రామ్ చరణ్ తో రాజమౌళి మూవీ అంటే బడ్జెట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. నిజానికి నిర్మాత డీవీవీ దానయ్య కూడా అలానే భావించారు. ఈ సినిమాకు ఎంత ఖర్చు అయినా భరించడానికి సంసిద్ధుడయ్యారు. ముందుగా 350 నుండి 400 కోట్ల రూపాయల మధ్య ఈ చిత్రానికి ఖర్చు అవుతుందని అనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు షెడ్యూల్స్ అన్నీ తారుమారు కావడంతో చివరకు అది సుమారు రూ. 500 కోట్లకు చేరింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన లేఖలో నటీనటుల, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, పన్నులు మినహాయించగా ఈ చిత్రానికి రూ. 336 కోట్లు ఖర్చు అయ్యిందని నిర్మాణ సంస్థ తెలియచేసింది. ఆ రకంగా చూసినా ఈ చిత్రానికి రూ. 500 కోట్లకు పైగానే ఖర్చు అయినట్టు లెక్క. అయితే లక్కీగా అటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ, ఇటు తెలంగాణలోనూ గతంలో లేని విధంగా అత్యధికంగా టిక్కెట్ రేట్లు పెంచి అమ్ముకోవడానికి రెండు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దాంతో మొదటి రోజు కలెక్షన్లు, వీకెండ్ కలెక్షన్లే కాదు… ఓవర్ ఆల్ గానూ ‘బాహుబలి -2’ రికార్డులను ‘ట్రిపుల్ ఆర్’ చెరిపేస్తుందనేది ట్రేడ్ వర్గాల అంచనా. అడ్వాన్స్ బుకింగ్స్ ను గమనిస్తే… ఆ విషయంలోనూ ‘ట్రిపుల్ ఆర్’ కొత్త రికార్డులను పలు దేశాలలో నమోదు చేసుకుంటోందని తెలుస్తోంది.
ప్రీ రిలీజ్ బిజినెస్ అదరహో!
‘ట్రిపుల్ ఆర్’ మూవీ బడ్జెట్ ను చిత్ర నిర్మాణ సంస్థ ఏదో ఒక స్థాయిలో అధికారికంగా ప్రకటించింది. అయితే ఇంతవరకూ జరిగిన బిజినెస్ ఎంత అనే దానిపై మాత్రం నిర్మాత దానయ్య సీక్రసీ మెయిన్ టైన్ చేస్తున్నారు. కానీ ట్రేడ్ వర్గాలు ఈ సినిమాకు గతంలో మరే చిత్రానికీ జరగనంత బిజినెస్ జరిగిందని చెబుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణ ఏరియాల థియేట్రికల్ హక్కుల్ని రూ. 165 కోట్లకు, ఉత్తరాది మార్కెట్ ను రూ. 140 కోట్లకు, తమిళనాడు హక్కుల్ని రూ. 48 కోట్లకు, కేరళ రూ. 15 కోట్లు, కర్నాటక రూ. 45 కోట్లకు, ఓవర్సీస్ హక్కుల్ని రూ. 70 కోట్లకు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో కొన్ని ఏరియాలకు రిఫండబుల్ గానూ, మరికొన్ని ఏరియాలకు నాన్ రిఫండబుల్ గానూ బిజినెస్ చేశారని అంటున్నారు. అలానే లహరి, టీ సీరిస్ సంస్థలకు రూ. 25 కోట్లకు ఆడియో హక్కులు అమ్మారన్నది సమాచారం. ఇక జీ, నెట్ ఫ్లిక్స్ సంస్థలకు పోస్ట్ థియేట్రికల్ ప్రసార హక్కులను ఏకంగా రూ. 325 కోట్లకు ఇచ్చారని తెలుస్తోంది. ఆ రకంగా చూసినప్పుడు రూ. 800 కోట్లకు పైగా ‘ట్రిపుల్ ఆర్’ బిజినెస్ జరిగినట్టు.
ప్రచారంలో పదనిసలు
‘ట్రిపుల్ ఆర్’ మూవీ మొదలైనప్పుడు దీన్ని 30 జూలై 2020లో విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. కానీ హీరోలకు గాయాలు కావడం, కరోనా కారణంగా షెడ్యూల్స్ కాన్సిల్ కావడంతో షూటింగ్ అనుకున్న విధంగా సజావుగా సాగలేదు. ఆ తర్వాత మూవీ పూర్తి కావడానికే ఎంతో సమయం పట్టింది. అయితే ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాల అనుభవంతో విఎఫ్ఎక్స్ వర్క్ ను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూ వచ్చారు. అలానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను చాలా ముందే ప్రారంభించారు. ఇక పాన్ ఇండియా మూవీగా దీన్ని విడుదల చేయాల్సి ఉండటంతో పాటు త్రీడీలోనూ రిలీజ్ చేసే ఆలోచన కలగడంతో కరోనా సెకండ్ వేవ్ సమయంలో దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను పూర్తి చేశారు. రకరకాల తేదీలను మార్చి చివరకు 2022 జనవరి 7న విడుదల ఖాయం అనుకున్న తర్వాత నవంబర్ నుండే ప్రచారాన్ని మొదలెట్టారు. గత యేడాది డిసెంబర్ లో ఏకంగా అటు ముంబైలోనూ, ఇటు చెన్నై, తిరువనంతపురంలోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ భారీగా నిర్వహించారు. కానీ జనవరి మాసంలో కరోనా థర్డ్ వేవ్ కు భయపడి వివిధ రాష్ట్రాలలోని థియేటర్లను మూసి వేయడంతో అనివార్యంగా ‘ట్రిపుల్ ఆర్’ను మరోసారి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా రెండు రిలీజ్ డేట్స్ ను ప్రకటించిన రాజమౌళి చివరకు మార్చి 25వ తేదీని లాక్ చేశారు. ఇక అక్కడ నుండి మరోసారి ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. ఈ సారి ఉత్తరాది రాష్ట్రాలపై ‘ట్రిపుల్ ఆర్’ టీమ్ దృష్టి పెట్టింది. మూవీ పేరులోని రాజమౌళి, రామ్ చరణ్, రామారావు… ఈ ముగ్గురే సినిమాను తమ భుజాలకెత్తుకుని వివిధ రాష్ట్రాలను చుట్టేస్తున్నారు.
వివాదాల కారణంగా విశేష ప్రచారం
నిజ జీవితంలో ఎప్పుడూ కలుసుకోని ఇద్దరు పోరాట యోధులను వెండి తెర మీద కలిసినట్టు చూపించడం ఓ చిత్రం! అయితే… కోట్లాది మందిని ప్రభావితం చేసిన ఆ అమరవీరుల చరిత్రను దర్శకుడు ఎక్కడ వక్రీకరిస్తాడోననే భయం కొందరిని వెంటాడుతూ ఉంది. భీమ్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసినప్పుడు అది నిజమైంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీమ్ కళ్ళకు కాటుక పెట్టి, అతని తలపై తెల్ల టోపీ పెట్టి అతన్ని ముస్లిం గెటప్ లో రాజమౌళి ఆ టీజర్ లో చూపించారు. దాంతో బీజేపీ వర్గాలు భగ్గుమన్నాయి. రాజమౌళిని తీవ్రంగా విమర్శించాయి. సినిమాలో ఒకానొక సన్నివేశంలో ఆ గెటప్ లో ఎన్టీయార్ కనిపిస్తాడు తప్పితే, అతన్ని ముస్లింగా చూపించలేదని, పైగా ఇది పూర్తిగా ఫిక్షన్ స్టోరీ అని రాజమౌళి మరోసారి వివరణ ఇచ్చారు. అలానే అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ మరికొందరు కోర్టుకు ఎక్కారు. కానీ ఆ కేసు నిలబడలేదు. దాంతో ఈ వివాదాలన్నీ సినిమా ప్రచారానికి ఉపయోగపడినట్టు అయ్యింది.
పంథా మార్చిన జక్కన్న!
‘బాహుబలి’ సినిమా విషయంలో రాజమౌళి బృందం కొత్త కొత్త విధానాలను అవలభించింది. ఆ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడంతో తొలి భాగం విడుదల సమయంలో నేర్చుకున్న పాఠాలను రెండో భాగం విడుదల సమయంలో అప్లయ్ చేశారు. మార్కెటింగ్, బిజినెస్, ప్రమోషన్స్ విషయంలో ఎప్పటికప్పుడు స్ట్రాటజీలను మార్చుకుంటూ వెళ్ళారు. ఆ అనుభవాలతో ఇప్పుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ ప్రమోషన్స్ ను మరింత ఎఫెక్టివ్ గా చేస్తున్నారు. ‘బాహుబలి’ సమయంలో మీడియాను వ్యూహాత్మకంగానే దూరంగా ఉంచిన రాజమౌళి బృందం ఇప్పుడు పంథా మార్చుకుంది. దేశ వ్యాప్తంగా మెరుపు పర్యటన చేస్తూనే, డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఇంటర్వ్యూలు చేసి జనం ముందు ఉంచుతోంది. ఈ చిత్రానికి పనిచేసిన టాప్ టెక్నీషియన్స్ నూ ఇంటర్వ్యూలు ఇవ్వమని ప్రోత్సహిస్తోంది. మీడియాలో ఇంటరాక్ట్ అయ్యే సమయంలో ఎలాంటి భేషజాలకు పోకుండా రాజమౌళి, ఎన్టీయార్, రామ్ చరణ్ హాయిగా సమాధానాలు చెబుతున్నారు. ఒక్కసారిగా వీరంతా మీడియా ఫ్రెండ్లీ పర్సన్స్ గా మారిపోయారు.
ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, కరోనా తర్వాత థియేటర్లలో జనాల పెద్దంతగా రాకపోవడం, తమది భారీ బడ్జెట్ చిత్రం కావడం… వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే రాజమౌళి తన పంథాను మార్చుకుని ఉండొచ్చు! అదే సమయంలో పీవీఆర్ వంటి పాపులర్ ఫిల్మ్ ఎగ్జిబిటర్ తోనూ గత యేడాది అక్టోబర్ లోనే ‘ట్రిపుల్ ఆర్’ ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా 850కు పైగా స్క్రీన్స్ ఉన్న ‘పీవీఆర్’ సంస్థ ‘పీవీఆర్ఆర్ఆర్’ అంటూ తమ పేరును మార్చుకుని ఈ మూవీని ప్రమోట్ చేస్తోంది. ఆ రకంగా ‘బాహుబలి’ చిత్రాన్ని మించిన ప్రమోషన్స్ ‘ట్రిపుల్ ఆర్’ విషయంలో జరుగుతున్నాయి. విశేషం ఏమంటే ‘బాహుబలి’ చిత్రాలకు మించిన రన్ టైమ్ ను ‘ట్రిపుల్ ఆర్’కు తీసుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా నిడివి మూడు గంటలు ఉందని సెన్సార్ సర్టిఫికెట్ బట్టీ తెలుస్తోంది. ఆ రకంగా సినీ ప్రేమికులకు, అభిమానులకు ఇది ఓ రకంగా ఫుల్ మీల్స్ లాంటి మూవీ అనే చెప్పాలి. అందువల్ల షడ్రుచుల సమ్మేళనమైన ‘ట్రిపుల్ ఆర్’ భారతీయ చిత్రసీమలో ఖచ్చితంగా ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమా అనూహ్యంగా మరింత చరిత్ర సృష్టిస్తుందేమో చూద్దాం.