The Indrani Mukerjea Story: సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో.. అందరికి తెల్సిందే. అయితే ఇప్పుడు వాటికన్నా ఇంట్రెస్టింగ్ గా మారాయి డాక్యుమెంటరీస్. ఏ ఈ కాలంలో డాక్యుమెంటరీలు ఎవరు చూస్తారు అనుకుంటే పొరపాటే. ఒక యదార్ధ సంఘటనను.. అప్పుడు అసలు ఏం జరిగింది.. ? అనేది పోలీసులు, కుటుంబ సభ్యులు, బంధువులు.. వారి మాటల్లోనే చెప్పడం, అసలు కథను రీక్రీయేట్ చేసి చూపిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన డాక్యూమెంటరీలు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే..ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చిన ‘బ్యాడ్ బాయ్ బిలియనీయర్స్’,’హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్’, ‘కర్రీ అండ్ సైనైడ్ మరియు ‘ది హంట్ ఫర్ వీరప్పన్’వంటి ఇండియన్ క్రైమ్ డాక్యుమెంటరీలు రికార్డు వ్యూస్ సాధించాయి.
ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి ది ఇంద్రాణి ముఖర్జీయా స్టోరీ: ది బరీడ్ ట్రూత్ చేరింది. అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే షీనా బోరా హత్యకేసు. ఒక 25 ఏళ్ళ అమ్మాయి.. నెల రోజులు కనిపించకుండా పోయి.. సడెన్ గా శవమై కనిపించింది. ఆమె సాధారణమైన అమ్మాయికాదు. ముంబైలోనే అతిపెద్ద మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జీ కూతురు కావడంతో ఈ కేసు హై ప్రొఫైల్ లిస్ట్ లోకి చేరింది. దాదాపు మూడేళ్లు.. 2012 నుంచి 2015 వరకు అసలు షీనా కేసులో ఇంద్రాణి నేరస్తురాలు అన్న విషయం తెలియలేదు. ఇంద్రాణి ముఖర్జీ గత ఆరున్నర సంవత్సరాలుగా జైలులో ఉండి మే 2022 లో జైలు నుంచి బయటకు వచ్చింది. ఇక ఈ కేసులో ఉన్న సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి. అతి దారుణమైన నిజాలను ఈ డాక్యుమెంటరీలో చూపించారు.
అసలు ఎవరు ఈ షీనా బోరా..?
షీనా గురించి చెప్పాలంటే ముందు ఇంద్రాణి గురించి మాట్లాడుకోవాలి. ఎవరికీ తెలియని నిజాలను ఆమె ఈ డాక్యుమెంటరీలో తెలిపింది. ఇప్పటివరకు షీనా.. ఇంద్రాణి కూతురు అని తెలుసు కానీ, ఆమె తండ్రి ఎవరు అన్నది మిస్టరీగా మారింది. కొందరు ఆమె తండ్రి.. ఇంద్రాణి మొదటి భర్త సిద్దార్థ్ దాస్ అని చెప్పుకొచ్చారు. కానీ, అసలు షీనా తండ్రి ఎవరు అన్నది ఇంద్రాణి బయటపెట్టింది. ఇంద్రాణి.. ఉపేంద్ర కుమార్ బోరా, దుర్గా రాణి బోరా లకు ఒక్కగానొక్క కూతురు. ఎంతో అందమైన ఆమె చిన్నతనాన్ని తండ్రి ఉపేంద్ర బోరా చిదిమేశాడు. నాలుగేళ్ళ వయసులో కన్నకూతురుపై ఉపేంద్ర అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లికి కూడా తెలుసు. భర్త పరువు పోతుందని ఆమె ఎవరికి చెప్పవద్దని కూతురును భయపెట్టింది. ఇక తండ్రి చేసిన ఘోరాన్ని దిగమింగుకొని.. బతుకుతున్న ఇంద్రాణిపై 16 ఏళ్ల వయస్సులో మరోసారి తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణానానికి ప్రతిఫలంగా పుట్టిందే షీనా బోరా. కన్నతండ్రే.. తన కూతురుకు సొంత తండ్రి అని చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఇంద్రాణికి మొదట స్నేహితుడుగా సిద్దార్థ్ దాస్ పరిచయమయ్యాడు. ఆ తరువాత షీనాను కూడా కూతురుగా అంగీకరించి.. ఇంద్రాణికి భర్తగా మారాడు. ఇక షీనాకు ఏడాది వచ్చేలోపు మిఖేల్ బోరాకు జన్మనిచ్చింది ఇంద్రాణి. ఇలా ఇద్దరు పిల్లలు.. మంచి జీవితంను వదిలి.. బయటకువచ్చేసింది. పిల్లలను పెంచే స్తోమత లేని సిద్దార్థ్ దాస్.. వారిని వారి గ్రాండ్ పేరెంట్స్ వద్ద వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు.
ఇంద్రాణి బోరా.. ఇంద్రాణి ముఖర్జియాగా ఎలా మారింది.. ?
ఇక కొన్నేళ్ళకు ఇంద్రాణి.. సంజీవ్ ఖన్నాను వివాహమాడింది. వీరికి పుట్టిన బిడ్డనే విధి ముఖర్జీ. ఇక ఇది కూడా ఎంతో కాలం సాగలేదు. రెండో భర్తను కూడా వదిలి.. కూతురుతో ఆమె ముంబైకు చేరుకుంది. అక్కడ మీడియా ఎగ్జిక్యూటివ్ అయిన పీటర్ ముఖర్జియాను కలవడం, ప్రేమ, పెళ్లి జరిగిపోయాయి. అప్పటికే పీటర్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్దవాడే రాహుల్. ఇక తన కూతురు విధిని కూడా పీటర్ కు వారసురాలిగా మార్చింది. ఇక్కడవరకు కథ అంతా ప్రశాంతంగా సాగింది. మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జియాతో పార్టీలు, సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న ఇంద్రాణి జీవితంలోకి కూతురు షీనా రావడం మింగుడు పడలేదు. అప్పటికే షీనా పెళ్లి వయసుకు వచ్చేసింది. ఇక ముంబైకు వచ్చిన షీనాను.. పీటర్ కుటుంబానికి కూతురుగా కాకుండా చెల్లెలిగా పరిచయం చేసింది. 16 ఏళ్లకే తల్లి అయ్యింది కాబట్టి.. షీనా, ఇంద్రాణికి చెల్లెలిలానే కనిపించడంతో పీటర్ వాళ్లు కూడా నమ్మేశారు. ఇక కాలం గడుస్తున్న కొద్దీ షీనా, పీటర్ పెద్ద కొడుకు రాహుల్ మధ్య స్నేహం , ప్రేమగా మారింది. ఇదొక అక్రమ సంబంధంగా చెప్పుకోవచ్చు.. ఇంద్రాణి కూతురు.. తన భర్త కొడుకుతో ప్రేమ అంటే.. అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకోవడం అన్నట్లు. దాన్ని ఇంద్రాణి భరించలేకపోయింది. షీనా ఏ విషయాన్నీ రాహుల్ వద్ద దాచాలనుకోలేదు. ఇంద్రాణి తన అక్క కాదని, సొంత తల్లి అని చెప్పేసింది. అయినా కూడా రాహుల్, షీనాను వదులుకోవాలని అనుకోలేదు. అందుకే వారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పారు. వారికి ఇబ్బందిగా ఉంటే.. తాము మళ్లీ ఈ ఇంటికి రాము అని, విదేశాల్లోనే సెటిల్ అవుతామని చెప్పారు. అయినా ఇంద్రాణి.. కూతురును బెదిరించి, భయపెట్టింది. ఇదంతా వద్దు.. వెళ్ళిపో అని చెప్పింది. కానీ, షీనా వినలేదు. నీ బతుకు నువ్వు చూసుకున్నావు.. నా బతుకు నేను చూసుకుంటాను అని చెప్పింది. అది ఇంద్రాణికి లేనిపోని సమస్యలను తీసుకొచ్చిపెట్టింది. దీంతో ఆమె అతి క్రూరమైన ఆలోచన చేసింది.
షీనా బోరాను ఇంద్రాణి ఎలా చంపింది.. ?
తల్లి కూతుళ్ళ మధ్య విబేధాలు రావడంతో.. పీటర్‌కు అసలు విషయం చెబుతానంటూ షీనా బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. అప్పటికే వ్యాపారంలోనూ ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు నష్టాలు చవిచూస్తూ ఉంది. షీనా సమస్య తీరాలంటే ఒకటే ఒక దారి.. ఆమెను చంపడం అని ఇంద్రాణి అనుకుంది. దానికి ప్లాన్ వేసింది. ఇందుకోసం రెండో భర్త సంజీవ్ ఖన్నాను హెల్ప్ అడిగింది. ఇక్కడ అతడు షీనాను చంపడానికి ఎందుకు ఒప్పుకున్నాడు అనేది మిస్టరీగా మారింది. ఇంద్రాణి కారు డ్రైవర్ తో షీనాను హత్య చేసే ప్లాన్ రెడీ చేసింది. షీనాతో మాట్లాడాలని పిలిచి.. ఆమె తాగే వాటర్ బాటిల్ లో మత్తుమందు కలిపి.. కారు ఎక్కాక.. ఇంద్రాణి, సంజీవ్ ఆమె గొంతు నులిమి చంపేసి.. ఒక అడవిలో షీనాను తగలబెట్టి పాతిపెట్టారు. రెండురోజులుగా షీనా కనిపించకపోవడంతో రాహుల్.. పోలీస్ కేసు పెట్టడం.. నెల తరువాత షీనా డెడ్ బాడీని పోలీసులు కనిపెట్టారు. దాదాపు మూడేళ్ళ తరువాత ఇంద్రాణినే హంతకురాలు అని పోలీసులు తేల్చారు. అలా ఆరేళ్ళు ఆమె జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చింది. అయితే ఆమె మాత్రం షీనా చనిపోలేదని, ఇప్పటికీ తను బ్రతికే ఉందని చెప్పడం గమనార్హం.
నేర చరిత్ర రికార్డుల్లో ఇది ఒక చీకటి అధ్యాయం
ఇప్పటివరకు ఇలాంటి ఒక హత్యను ఎక్కడ కనివిని ఎరిగి ఉండరు. నేర చరిత్ర రికార్డుల్లో ఇది ఒక చీకటి అధ్యాయం.. కన్నతల్లి.. కన్నకూతురును ఇంత కిరాతకంగా.. అతి క్రూరంగా చంపడం అనేది ఏ ఒక్కరికి జీర్ణం చేసుకోలేని విషయం. ముంబైతో పాటు ఇండియా మొత్తాన్ని గడగడలాడించిన ఈ కేసులో అసలు నిజాలు ఏంటి.. ? అనేది ఇంకాతెలియలేదు. ఈ డాక్యుమెంటరీలో ఇంద్రాణి.. తాను ఎవరిని చంపలేదు.. తప్పు చేయనప్పుడు చెప్పుకోవడంలో ఎటువంటి గిల్టీ లేదు అని చెప్పడం విశేషం.