సినీప్రియులు నచ్చి, మెచ్చి మరీ మరీ చూసిన చిత్రాలు అనేకం. వాటిలో 1972లో తెరకెక్కిన ‘ద గాడ్ ఫాదర్’ మరపురానిది. మరువలేనిది. మరచిపోకూడనిది అని చెప్పవచ్చు. 1930లలో మాటలు విరివిగా విసరడం మొదలెట్టిన సినిమాకు తొలుత జాన్ ఫోర్డ్ రూపొందించిన వెస్ట్రన్స్, ఫ్యామిలీ డ్రామాస్ పెద్ద బాలశిక్షగా పనిచేశాయి. 1941 తరువాత ఎందరో సినీ ఫ్యాన్స్ తాము ఆర్సన్ వేల్స్ రూపొందించిన ‘సిటిజెన్ కేన్’ చూసి స్ఫూర్తి చెందామని అంటారు. ఆ తరువాత ఆ స్థాయిలో సినీ లవర్స్ ను ఆకట్టుకున్న చిత్రం ఏదంటే 1972లో ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పొలో తెరకెక్కించిన ‘ద గాడ్ ఫాదర్’ అనే చెప్పాలి. ఈ సినిమా ప్రభావంతోనే ఎంతోమంది సినీరంగంపై మోజు పెంచుకున్నారు. ఆ స్ఫూర్తితో కొందరు నటులుగా మారితే, మరికొందరు మెగాఫోన్ పట్టి ఆకట్టుకున్నారు. అందుకు కారకులు ఆ చిత్రంలో విటో కార్లియోన్ గా నటించిన మార్లన్ బ్రాండో, ఆ సినిమాను రూపొందించిన దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా అని చెప్పవచ్చు. ఈ నాటికీ సినిమా లవర్స్ ఎక్కడో ఓ చోట ‘ద గాడ్ ఫాదర్’ సిరీస్ గురించి చర్చించుకుంటూ ఉంటారు. అందులో మొదటి భాగంగా తెరకెక్కిన 1972లో విడుదలైన ‘ద గాడ్ ఫాదర్’ గురించిన చర్చనే విశేషంగా చోటు చేసుకుంటూ ఉంటుంది. మరి ఎందుకని ఈ చిత్రం ఇంతలా ఆకట్టుకుంటోంది?
ఆకట్టుకొనే కథ, కథనం!
ప్రముఖ అమెరికన్ నవలా రచయిత మారియో ప్యూజో రాసిన ‘ద గాడ్ ఫాదర్’ ఆధారంగానే ఫోర్డ్ కొప్పోలా మూడు భాగాలు రూపొందించారు. 1969లో ఈ నవల వెలుగు చూసింది. వచ్చీ రాగానే పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇటలీకి చెందిన సిసిలియన్స్ అమెరికాలో ఎలా పాగా వేశారు. అక్కడ తమ ఆధిపత్యాన్ని ఎలా చాటుకున్నారు. ప్రభుత్వాలకు సమాంతరంగా తమ చట్టాన్ని ఎలా అమలు చేశారు అన్న అంశాలను ఈ నవలలో విపులంగా విశదీకరించారు. దాంతో పాఠకులను ‘ద గాడ్ ఫాదర్’ నవల భలేగా ఊహాలోకాల్లో విహరింప చేసింది. బుద్ధిజీవి అయిన ప్రతి మనిషి మనసులో ఆధిపత్యం చెలాయించాలనే అభిలాష ఉంటుందని మనోవిశ్లేషకులు విపులీకరించారు. చట్టం ముందు అందరూ సమానులే అని వినిపిస్తూ ఉంటుంది. కానీ, పలుకుబడి, పరపతి, హోదా కలిగిన వారి విషయంలో ఇది వేరుగా కనిపిస్తుంది. అందువల్ల సామాన్యులు చట్టాన్ని తామే చేతుల్లోకి తీసుకోవాలన్న కోరికతో ఉంటారు. కానీ, అది సగటు జీవి నిత్యావసర సముపార్జన సాధనలో అణగారి పోతుంది. మనసు పొరల్లో మాత్రం నిక్షిప్తమై ఉంటుంది. ‘ద గాడ్ ఫాదర్’ కథలో విటో కార్లియోన్ పాత్రను గమనిస్తే, అతను సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. వాటిని అధిగమించడానికి ఎలా పాటుపడ్డాడు. చివరకు ఎలా అందరికీ నాయకుడు అయ్యాడు అన్న అంశాలు విశేషంగా కనిపిస్తాయి. 1970ల నాటి యువత మనసుల్లో కార్లియోన్ పాత్రను చదవగానే, తమను తాము అందులో చూసుకున్న భావన కలిగింది. ఆ కథను అదే తీరున కొప్పోలా జనాన్ని ఆకట్టుకొనేలా కనువిందు చేస్తూ తెరపై ఆవిష్కరింప చేశారు. ఇంకేముంది యువకులు మొదలు నడుం వంగిన నాయకుల వరకు అందరూ ‘ద గాడ్ ఫాదర్’లోని విటో కార్లియోన్ తామే అన్నట్టుగా భావించారు. ‘ద గాడ్ ఫాదర్’గా నటించిన మార్లన్ బ్రాండోకు సైతం తమ మనసుల్లో పట్టం కట్టారు.
అదే అసలు కారణం…
అంతకు ముందు కూడా హాలీవుడ్ లో గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో పలు చిత్రాలు రూపొందాయి. మరి వాటిలో లేనిది, ‘ద గాడ్ ఫాదర్’లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే పాత్రల రూపకల్పన అనే చెప్పాలి. వానర రూపం నుండి రూపాంతరం చెందుతున్న సమయం నుంచీ మనిషిలో ఆధిపత్య కాంక్ష అధికంగా ఉండేది. బలవంతుడు గెలిచాడు, బలహీనుడు ఓడి వేరే దారుల్లో పగ తీర్చుకొనే ప్రయత్నం చేశాడు. ఇలా ఎప్పటికప్పుడు ఆధిపత్యం కోసం సాగిన పోరాటాలే చరిత్రలో అధికంగా కనిపిస్తాయి. రామాయణ, భారతాల్లోనే కాదు, బైబిల్, ఖురాన్ లోనూ ఇలాంటి పోరాటాలు తారసిల్లుతాయి. ఈ నేపథ్యంలోనే ఇటలీకి చెందిన సిసిలియన్లు తాము వలస వెళ్ళిన అమెరికాలో ఎలా దాడులు చేస్తూ జీవన సమరం సాగించారు అన్నది విటో కార్లియోన్ పాత్ర రూపంలో కళ్ళకు కట్టారు రచయిత మారియో ప్యూజో. అచ్చుగుద్దినట్టే దానిని తెరపై ఆవిష్కరించి, అలరించారు కొప్పోలా. ఈ నవల చదివి కూడా కొందరు రచనలో అడుగు పెట్టారన్న విషయాన్ని మరవరాదు.
‘గాడ్ ఫాదర్’ ఘనవిజయం!
‘ద గాడ్ ఫాదర్’ నవల చదివిన వారందరూ అంత పెద్ద కథను సినిమాగా తీయడం అంత సులువు కాదని భావించేవారు. నవల వెలుగు చూసిన రెండేళ్ళకే కొప్పోలా ‘గాడ్ ఫాదర్’ను తెరకెక్కిస్తోంటే కొన్ని విమర్శలూ వినిపించాయి. అయితే కొప్పోలా తన సొంత కవిత్వమేదీ అందులో మిళితం చేయకుండా, ‘ద గాడ్ ఫాదర్’కథలోని ఆత్మ చెడకుండా రూపొందించడానికి అసలు రచయిత మారియో ఫ్యూజోతో కలసి స్క్రీన్ ప్లే రూపొందించారు. అక్కడే కొప్పోలా అసలైన విజయం సాధించారని చెప్పవచ్చు. నవల చదువుతూ తమ ఊహల్లో విహరించిన పాఠకులను సైతం సమ్మోహితులను చేస్తూ ‘ద గాడ్ ఫాదర్’రూపొందింది. ఆ రోజుల్లో 7.2 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ‘ద గాడ్ ఫాదర్’ ప్రపంచ వ్యాప్తంగా 291 మిలియన్ డాలర్లు పోగేసింది. అంటే నలభై రెట్లు రాబడి చూసిందీ చిత్రం. దాదాపు మూడు గంటల పాటు సాగే ‘గాడ్ ఫాదర్’ మొదటి భాగం చూపరులను ఇట్టే తనలో లీనం చేసుకుంటుంది. ఇప్పటిలా అప్పట్లో హాలీవుడ్ మూవీస్ ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేవి కావు. అమెరికాలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా మెల్లగా యూరప్ దేశీయులను, ముఖ్యంగా ఇటలీ జనాన్ని ఆకట్టుకుంది. ఆ పై మన భారతదేశంలో విడుదలై ఇక్కడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో గుర్రం తలను నరికి, రక్తసిక్తంగా బెడ్ పై ఉంచుతారు. ఆ సీన్ ను తలపించేలా నిజమైన రక్తం అని భ్రమించేలా ఓ గుర్రం తల చుట్టూ ఎర్రని రంగు కారేలా రంగుల బొమ్మలు రూపొందించారు. వాటిని ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల ముందు ప్రదర్శనకు పెట్టారు. జనం వాటిని చూడటానికే తండోపతండాలుగా వచ్చేవారు. అలా చూసిన వారు ‘ద గాడ్ ఫాదర్’ను చూసి తీరాలని పరితపించి, బాక్సాఫీస్ వైపు పరుగులు తీసేవారు.
ఇక ‘ద గాడ్ ఫాదర్’ చిత్రం ఆస్కార్ అవార్డుల్లో పది నామినేషన్స్ సంపాదించింది. ఆస్కార్స్ లో అన్నిటికన్నా ప్రతిష్ఠాత్మకంగా భావించే బెస్ట్ ఫిలిమ్ అవార్డును కైవసం చేసుకుంది. అదే అవార్డుల్లో ఉత్తమనటునిగా మార్లన్ బ్రాండో, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో మారియో ప్యూజో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా ఎన్నికయ్యారు.
ఆస్కార్ తిరస్కరణ!
ఒకప్పుడు కళలన్నవి దైవానుగ్రహంగా భావించేవారు. కానీ, సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని మనిషి నిరూపించాడు. నటులు కావాలంటే అదృష్టం ఉండాలని కొందరు అంటూ ఉంటే, కాదు అభ్యాసం కావాలని లోకానికి చాటారు స్టాన్స్ స్లా విస్కీ. ఆయన రూపొందించిన సూత్రాల ఆధారంగా రూపొందినదే ‘మెథడ్ యాక్టింగ్’ అన్నది. నటులు, దర్శకులు ‘మెథడ్’ అన్న పదాన్ని చర్చించుకొనే ప్రతీసారి అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే నటుడు మార్లన్ బ్రాండో అనే చెప్పాలి. ఆయన కంటే ముందు, తరువాత కూడా ‘మెథడ్’ను అనుసరించిన వారు, అనుసరిస్తున్న వారు లేకపోలేదు. అయితే ‘మెథడ్ యాక్టింగ్’కు ఓ స్పెషల్ క్రేజ్ ను తీసుకు వచ్చిన ఘనత మాత్రం మార్లన్ బ్రాండో అనే చెప్పాలి. వరుసగా 1951, 1952. 1953, 1954 సంవత్సరాలకు ఆస్కార్ అవార్డ్స్ – బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నామినేషన్ పొందిన ఘనత మార్లన్ బ్రాండో సొంతం. అయితే మొదటి మూడు సంవత్సరాల్లో బ్రాండో కు నిరుత్సాహమే మిగిలింది. నాల్గవ సంవత్సరంలో ‘ఆన్ ద వాటర్ ఫ్రంట్’ చిత్రం ద్వారా మార్లన్ బ్రాండో ఉత్తమ నటునిగా ఆస్కార్ అందుకున్నారు. అప్పటి నుంచీ బ్రాండో ప్రపంచవ్యాప్తంగా జేజేలు అందుకుంటూనే ఉన్నారు. ‘ద గాడ్ ఫాదర్’ సినిమాతో మరోమారు ఉత్తమనటునిగా ఆస్కార్ అవార్డు గెలిచారు. అయితే, కొన్ని రాజకీయ కారణాల వల్ల మార్లన్ బ్రాండో ఆ అవార్డును అందుకోవడానికి తిరస్కరించారు. దాంతో మరింత సంచలనం సృష్టించారు. ఆస్కార్ అవార్డు రావడమే కలగా జీవించే నటులు ఎందరో ఉన్నారు. అలాంటిది వచ్చిన ఆస్కార్ తిరస్కరించిన మొదటి మొనగాడిగా బ్రాండో నిలిచారు. ఇంతకూ బ్రాండో అంతటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డు ఎందుకు తిరస్కరించినట్టు? స్థానిక అమెరికావాసులపై వలసవాదులు ఆధిపత్యం నేపథ్యంలో ‘అమెరికన్ ఇండియన్ మూవ్ మెంట్’ ఏర్పడింది. పైగా స్థానికులను అమెరికా సినిమాల్లో చూపించే విధానాన్నీ మార్లన్ బ్రాండో వ్యతిరేకించారు. అసలు హాలీవుడ్ సినిమా యూదులపై ఆధారపడి నడుస్తోందనీ ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి చోట ఇచ్చే గౌరవం కూడా అందుకోనంటూ ‘ద గాడ్ ఫాదర్’ సినిమా ద్వారా తనకు ఒకవేళ ఉత్తమనటుడు అవార్డు లభిస్తే, దానిని అందుకోబోనని నేటివ్ అమెరికన్ యాక్ట్రెస్ లిటిల్ ఫెదర్ ద్వారా సందేశం పంపించారు మార్లన్. ఆయన ఊహించినట్టుగానే ఆయనకే ఉత్తమనటుడు అవార్డు లభించింది. ఆ వేదికపై లిటిల్ ఫెదర్ గళం ద్వారా మార్లన్ తన మనోభావాలను వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఈ నాటికీ విశేషంగా చెప్పుకుంటూనే ఉన్నారు.
‘గాడ్ ఫాదర్’ ప్రభావం!
‘ద గాడ్ ఫాదర్’ సినిమా చూసి స్ఫూర్తి చెందినవారు ఎందరో ఉన్నారు. హాలీవుడ్ డైరెక్టర్స్ మార్టిన్ స్కార్ససే తన ‘గుడ్ ఫెల్లాస్’ సినిమా తీసి విజయం సాధించారు. డేవిడ్ ఛేజ్ తన టీవీ సీరిస్ ‘ద సోప్రనాస్’ రూపొందించి అలరించారు. ఈ చిత్రం చూసి ప్రభావితులైన దర్శకుల్లో మన ఫిరోజ్ ఖాన్, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, భరతన్ ఉన్నారని చెప్పవచ్చు. ఫిరోజ్ ఖాన్ తన ‘ధర్మాత్మ’ చిత్రాన్ని ‘గాడ్ ఫాదర్’ అనుకరణతోనే రూపొందించారని ఇట్టే తెలిసిపోతుంది. ఇక మణిరత్నం కూడా ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితోనే ‘నాయకుడు’ తెరకెక్కించి విజయం సాధించిన అంశాన్ని మరువరాదు. ‘నాయకుడు’లో హీరోగా నటించిన కమల్ హాసన్ మరో ముందడుగు వేసి, ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితో మన పల్లెల్లోని కక్షలు, కార్పణ్యాల నేపథ్యంలో భరతన్ దర్శకత్వంలో ‘దేవర్ మగన్’ (తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’) రూపొందించారు. మన రామ్ గోపాల్ వర్మ అయితే తన ‘గాయం’ చిత్రంలోనూ, తరువాత అమితాబ్ బచ్చన్ తో హిందీలో తెరకెక్కించిన ‘సర్కార్’లోనూ కొన్ని సీన్స్ ను ‘ద గాడ్ ఫాదర్’ నుండి దించేశారంతే! రాము తరువాతి రోజుల్లో తెరకెక్కించిన గ్యాంగ్ స్టర్ మూవీస్ అన్నిటికీ ‘ద గాడ్ ఫాదర్’ స్ఫూర్తి అని చెప్పక తప్పదు. మళయాళంలో ఓ కుటుంబ కథాచిత్రానికి ‘ద గాడ్ ఫాదర్’ అని పేరు పెట్టడమే కాదు, అందులో రెండు వర్గాల మధ్య వైరాన్ని బహు రమ్యంగా తెరకెక్కించారు. ఆ మళయాళ సినిమా స్ఫూర్తితోనే తెలుగులో ‘పెద్దరికం’ తెరకెక్కింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఏయన్నార్ ప్రధాన పాత్రలో ‘గాడ్ ఫాదర్’ అనే తెలుగు చిత్రం వెలుగు చూసింది. అంతకు ముందు, ఆ తరువాత కూడా మన భారతీయ భాషా చిత్రాల్లో ‘గాడ్ ఫాదర్’ టైటిల్స్ చోటు చేసుకున్నాయి. ఇప్పుడు చిరంజీవి హీరోగా రూపొందుతోన్న మళయాళ ‘లూసిఫర్’ రీమేక్ కు తెలుగులో ‘గాడ్ ఫాదర్’ అనే నామకరణం చేయడం విశేషం! ఇలా యాభై ఏళ్ళుగా ‘గాడ్ ఫాదర్’ ఏదో విధంగా సినీ ఫ్యాన్స్ ను వెన్నాడుతూనే ఉన్నాడు.
మూడు భాగాలుగా ‘ద గాడ్ ఫాదర్’
ఇంతలా ప్రభావితం చూపించిన ‘ద గాడ్ ఫాదర్’ చిత్రం తరువాత మరో రెండు భాగాలు రూపొందింది. అందులో రెండో భాగం ‘ద గాడ్ ఫాదర్-2’ కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. అయితే మొదటి భాగం సాధించిన విజయంతో పోలిస్తే, రెండో భాగం సక్సెస్ సాధారణమనే చెప్పాలి. 1974లో విడుదలైన ‘ద గాడ్ ఫాదర్ పార్ట్ -2’ కూడా ఆస్కార్ బరిలో సందడి చేసింది. 11 నామినేషన్లు సంపాదించింది. వాటిలో బెస్ట్ పిక్చర్ గా రెండో భాగం కూడా ఎన్నిక కావడం అప్పట్లో విశేషంగా ముచ్చటించుకున్నారు. ఈ రెండో భాగం ద్వారా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా బెస్ట్ డైరెక్టర్ గా నిలిచారు. రాబర్ట్ డీ నిరో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గానూ, బెస్ట్ స్కోర్, బెస్ట్ ఆర్ట్ విభాగాల్లోనూ ‘ద గాడ్ ఫాదర్ -2’ విజయఢంకా మోగించింది. మరో మారు బెస్ట్ ఆడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో మారియో ప్యూజో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా విజయం సాధించడం విశేషం! అలా వరుసగా రెండు భాగాలతో ‘బెస్ట్ పిక్చర్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే’ విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అందుకోవడం ‘ద గాడ్ ఫాదర్’ సీరిస్ కే దక్కింది. ‘ద గాడ్ ఫాదర్-2’ విడుదలైన 16 ఏళ్ళకు అంటే 1990లో మూడో భాగంగా ‘ద గాడ్ ఫాదర్ -3’ జనం ముందు నిలచింది. కానీ, ఏ మాత్రం తన ముందు చిత్రాలలాగా అలరించలేక పోయింది. ఈ మూడు చిత్రాలలోనూ మైఖేల్ కార్లియోన్ పాత్రలో అల్ పచినో నటించారు. ఓ దర్శకుడు రూపొందించిన సీక్వెల్స్ రెండూ అత్యుత్తమ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకోవడం అన్నది ‘ద గాడ్ ఫాదర్’కే దక్కిందని చెప్పవచ్చు. ‘ద గాడ్ ఫాదర్’ పేరిట ఓ గేమ్ కూడా రూపొందింది. ఇలా చెప్పుకుంటూ పోతే ‘ద గాడ్ ఫాదర్’ ముచ్చట్లు బోలెడు సాగుతాయి. అంతెందుకు, ‘ద గాడ్ ఫాదర్’ అంత గొప్ప చిత్రంగా ఎందుకు నిలచిందో తెలుసుకోవడానికి ఆ సినిమాను చూస్తే పోలా? చూసిన వారు మళ్ళీ చూసినా ఇప్పటికీ కొత్తగానే ఉంటుందీ చిత్రం. అదీ 1972 నాటి ‘ద గాడ్ ఫాదర్’ చిత్రం మహత్తు!