Tollywood : తెలుగు సినిమా పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్టు ఎగ్జిబిటర్లు (థియేటర్ల ఓనర్లు) ప్రకటించారు. అద్దెలపై థియేటర్లను నడిపించలేమని.. పర్సెంటీజీ ఇస్తేనే నడిపిస్తామని తేల్చి చెప్పారు. దిల్ రాజు, సురేష్ బాబుతో ఏపీ, తెలంగాణకు చెందిన 65 మంది ఎగ్జిబిటర్లు భేటీ అయి ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పుడు ఎగ్జిబిటర్ల డిమాండ్లను నిర్మాతలు అంత ఈజీగా ఒప్పుకునే పరిస్థితులు కనిపించట్లేదు. చూస్తుంటే కొన్ని రోజుల పాటు ఈ రచ్చ కొనసాగేలా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు జూన్ లో రిలీజ్ కావాల్సిన సినిమాల పాలిట శాపంగా మారిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. జూన్ లో పెద్ద సినిమాలు రిలీజ్ డేట్లు ప్రకటించాయి. జూన్ 5న కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ రాబోతోంది. దీన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Read Also : KCR: అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ భరోసా
ఇప్పటికే తెలుగులో కూడా ప్రమోషన్లు మొదలు పెట్టారు. మరి థియేటర్ల ఓనర్లు తమ సమస్యలు పరిష్కారం కాకపోతే థియేటర్లను మూసేయడం ఖాయం. అప్పుడు థగ్ లైఫ్ ను వాయిదా వేసుకుంటారా లేదంటే ఇతర రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తారా అన్నది తెలియాలి. ఇటు పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చాలా ఏళ్ల ఎదురు చూపు తర్వాత జూన్ 12న వస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో జూన్ 12న థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడేమో థియేటర్లు బంద్ చేస్తే సినిమా పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. ఒకవేళ థియేటర్లు మూసి ఉంటే మాత్రం సినిమాను వాయిదా వేసుకోవాల్సిందే.
ఎందుకంటే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలే అతిపెద్ద మార్కెట్. కాబట్టి వాయిదా తప్పదు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర మూవీ జూన్ 20న వస్తోంది. ఇందులో నాగార్జున, ధనుష్ నటిస్తున్నారు. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఎగ్జిబిటర్లు మూవీ రిలీజ్ డేట్ వరకు మనసు మార్చుకోకపోతే మాత్రం ఈ సినిమా వాయిదా తప్పదు. ఒకవేళ రిలీజ్ చేస్తే ఇతర రాష్ట్రాల్లోనే చేయాలి. అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ మూవీ జూన్ 20నే వస్తోంది. అది కూడా వాయిదా తప్పదని అంటున్నారు. ఒకవేళ రిలీజ్ చేసుకుంటే బాలీవుడ్ లో చేయొచ్చు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను కూడా జూన్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఒకవేళ అప్పటి వరకు ఎగ్జిబిటర్ల డిమాండ్లు పరిష్కారం కాకపోతే మాత్రం థియేటర్లు మూసి ఉంటాయి. అలాంటప్పుడు కన్నప్ప వాయిదా కూడా తప్పదేమో. కానీ ఇదంతా ఎగ్జిబిటర్ల చేతుల్లోనే ఉంది. వాళ్లు గతంలో కూడా ఇలాంటి డిమాండ్లు చేశారు. కానీ ఈ స్థాయిలో తీర్మాణాలు చేయలేదు. ఇప్పుడు మాత్రం తమ డిమాండ్లు సాధించుకునే దాకా వెనకడుగు వేసేది లేదని తేల్చి చెబుతున్నారు.
మరి పర్సెంటేజీ ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకుంటారా అంటే అనుమానమే. ఇప్పటికే బడ్జెట్, నటుల రెమ్యునరేషన్ భారీగా ఉందని.. అవన్నీ కవర్ కావడానికే చాలా కష్టం అవుతుందని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పుడు థియేటర్ల ఓనర్లకు పర్సెంటీజీ ఇస్తే తమకు మిగిలేదీ ఏమీ ఉండదని నిర్మాతల మండలి అంటోంది. కాబట్టి ఈ సమస్య చాలా జఠిలంగానే మారుతోంది. మే నెలాఖరు వరకు చర్చలు సఫలం అయితే ఓకే. లేదంటే జూన్ లోని సినిమాలపై భారీ ఎఫెక్ట్ ఖాయం.
Read Also : Tollywood : ఎగ్జిబిటర్ల సంచలన నిర్ణయం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్..