ఇళయదళపతి విజయ్ నటిస్తున్న కొత్త సినిమాకు ‘వారసుడు’ అనే టైటిల్ నిర్ణయించారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమాకు ‘వారిసు’ అనే పేరు ప్రకటించారు. విజయ్ నటిస్తున్న 66వ చిత్రమిది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. రశ్మక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శరత్ కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, పూర్ణ, యోగిబాబు, సంగీత ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.
తమిళంలో ‘వారిసు’ అంటే తెలుగులో ‘వారసుడు’ అని అర్ధం. గతంలో ఇదే పేరుతో నాగార్జున హీరోగా ఇవివి దర్శకత్వంలో వచ్చిన సినిమా హిట్ అయింది. మరి తెలుగులో ‘వారసుడు’ అని పెడతారా? లేక వేరే టైటిల్ నిర్ణయిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవల వచ్చిన విజయ్ సినిమా ‘బీస్ట్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల కాలంలో తెలుగులో కూడా విజయ్ కి మార్కెట్ ఏర్పడింది. దీంతో విజయ్ పుట్టిన రోజున హైదరాబాద్ ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ 35 ఎం.ఎంలో విజయ్ తెలుగు ఫ్యాన్స్ కోసం ‘తుపాకి’ సినిమాను ప్రదర్శించనున్నారు. మరి దిల్ రాజు నిర్మిస్తున్న ‘వారిసు’ (వారసుడు) సినిమాతో అయినా తెలుగునాట విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందమో చూద్దాం.