తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ మరోసారి తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు విజయ్ తన లైనప్ లో ఉన్న సినిమాలని కంప్లీట్ చెయ్యగానే తెలుగు దర్శకుడితో సినిమా చేస్తాడనే మాట వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు ప్రొడక్షన్ లో వారసుడు సినిమా చేశాడు దళపతి విజయ్. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని రోజుల తేడాతో రిలీజ్ అయిన ఈ మూవీ ఓవరాల్ గా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది. విజయ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ విజయ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. అయితే వారసుడు సినిమాపై ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి, సీరియల్ లా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. ఇదే సమయంలో తమిళనాడులో వారిసు ముందు రిలీజ్ అయ్యి తెలుగులో వారసుడు వాయిదా పడేసరికి ఇక విజయ్ ఇకపై తెలుగు దర్శకుడితో సినిమా చెయ్యడని అంతా అనుకున్నారు.
ప్రస్తుతం విజయ్, లోకేష్ కనగారాజ్ తో లియో సినిమా చేస్తున్నాడు. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా షూటింగ్ జూలై నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత విజయ్-అట్లీ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవ్వనుంది. హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ లో సినిమా అయిపోగానే విజయ్, గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేసే ప్లాన్ చేస్తున్నాడట. ఈ సంక్రాంతికి బాలయ్యతో వీర సింహా రెడ్డి సినిమా చేసి, వంద కోట్ల దర్శకుడిగా మారిన గోపీచంద్ మలినేని-మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో ఈ సినిమా ఉండనుందని టాక్. విజయ్ కి గోపీచంద్ మలినేని కథ కూడా వినిపించాడని, విజయ్ ఓకే చెప్పాడని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముంది అనేది తెలియాల్సి ఉంది.