TFPC Prasanna Kumar Clarity On Varisu Controversy: దళపతి విజయ్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వారిసు’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ విడుదల గురించి గత కొన్ని రోజులుగా గొడవ జరుగుతోంది. పండగ సీజన్‌లో తెలుగు సినిమాలకే మొదటి ప్రాదాన్యత ఇవ్వాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోరింది. ఈ స్టేట్మెంట్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ మంచి సినిమాని ఎవరూ ఆపలేరని చెప్పాడు. ఇక తమిళనాడులో ఈ వారిసు వివాదం చాలా దూరమే వెళ్ళింది. తమ హీరో సినిమాకి థియేటర్స్ ఇవ్వకపోతే, తెలుగు సినిమాలని తమిళనాడులో విడుదల కాకుండా చేస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు ఎన్. లింగుస్వామి మరో అడుగు ముందుకేసి ‘వారిసు’ రిలీజ్‌కు అడ్డంకులు సృష్టిస్తే తమిళనాడులో తెలుగు సినిమాలకు అడ్డంకులు సృష్టిస్తామంటూ మన నిర్మాతలకి ఏకంగా వార్నింగ్ ఇచ్చినంతపని చేశాడు. విజయ్ సినిమాకి థియేటర్స్ ఇవ్వకపోతే ‘వారిసు’కు ముందు.. ‘వారిసు’ తరువాత అనే స్థాయిలో పరిస్థితులు మారతాయన్నాడు.
ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్ గా మారిన లింగుస్వామి మాటలపై టీఎఫ్‌పీసీ సెక్రటరీ ప్రసన్నకుమార్ స్పందిస్తూ… ‘2023 సంక్రాంతి రిలీజ్‌ల విషయంలో తొలి ప్రాధాన్యం తెలుగు సినిమాలకు ఇవ్వాలంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ ప్రకటనని విడుదల చేసింది. మొదటి ప్రాధాన్యత తెలుగు సినిమాలకు ఇవ్వాలని.. మిగిలిన థియేటర్స్‌ని డబ్బింగ్ సినిమాలకు ఇవ్వాలని దాని సారాంశం. అంతేకానీ డబ్బింగ్ సినిమాలని తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ చేయాలని కానీ, డబ్బింగ్ సినిమాలని తెలుగు రాష్ట్రాల్లో ఆడనివ్వమని ఆ ప్రకటనలో ఎక్కడా లేదు. మేము ప్రకటన చేసిన తరువాత ప్రేక్షకులని ఎమోషన్‌కు గురిచేసేలా కొంత మంది మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమ సినిమాలని ఆడనివ్వకపోతే.. తెలుగు సినిమాలను అక్కడ రిలీజ్ కానవ్వబోమని అనడం అర్థరహితం. సినిమా అనేది అందరికి సంబంధించింది. ‘లీవ్ అండ్ లెట్ లీవ్’ అనే విషయాన్ని అంతా గ్రహించాలి’ అన్నారు. వారిసు విడుదలని అడ్డుకోవట్లేదు, ముందు తెలుగు సినిమాలకి ప్రాధాన్యతనిచ్చి ఆ తర్వాత మిగిలిన థియేటర్స్ ని డబ్బింగ్ సినిమాలకి ఇవ్వాలనే మాటని ప్రసన్న కుమార్ స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఇక్కడితో అయినా వారిసు విడుదల వివాదం సద్దుమనుగుతుందా లేక ఈ మాటతో ఈ వివాదం మరో మలుపు తిరుగుతుందా అనేది చూడాలి.