Nandi Awards: రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ సహాయ సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో 13 మంది జ్యూరీ సభ్యుల సమక్షంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుకలు ఆగస్టు 12 న దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివరాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బి. గోపాల్, మురళీ మోహన్, సుమన్, శివాజీ రాజా, రేలంగి నరసింహారావు, రోజా రమణి, జర్నలిస్ట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టియఫ్ సీసీ ఛైర్మెన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ”2021, 22 సంవత్సరంలో విడుదలైన చిత్రాల వాళ్ళు అవార్డుల పరిశీలనకు టీఎఫ్‌సీసీ వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకోవచ్చు. దీనికి జూన్ 15 వరకూ గడువు ఉంది. ప్రముఖులతో ఏర్పాటు అయిన కమిటీ మెంబర్స్ చిత్రాలను చూసి అర్హులు అనుకున్న వారికి అవార్డ్స్ ప్రకటిస్తారు. ఆగస్టు 12న దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా నంది అవార్డులు ఇవ్వనున్నాం. ఈ నంది అవార్డ్స్ వేడుకకు టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇండస్ట్రియల్ చైర్మన్ బాల మల్లు, యఫ్. డి. సి. చైర్మన్ అనిల్ కుర్మాచలం, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్, ఏపీ నుండి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గోపాలకృష్ణ, హోసింగ్ మినిస్టర్ జోగి రమేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అలాగే కేరళ సి. యంను కూడా ఆహ్వానించడం జరిగింది. కర్ణాటక ఎం.ఎల్.ఏ. మధు బంగారప్ప, కన్నడ, తమిళ, మలయాళం నుండి పలువురు హీరోలు వస్తుండగా తెలుగు నుండి అనేక మంది కథానాయకులు పాల్గొనబోతున్నారు. తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ కూడా గెస్ట్ గా హాజరు కాబోతున్నారు” అని అన్నారు.
రెగ్యులర్ సినిమా విభాగాలకు అవార్డులను అందించడంతో పాటు ఎన్టీఆర్, ఎయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కాంతారావు స్మారక అవార్డులను ఈ వేదికపై ప్రదానం చేయబోతున్నారు. అలానే టీవీ యాంకర్లు, మేల్ & ఫిమేల్ న్యూస్ & ఎంటర్టైన్మెంట్ ప్రెజెంటర్స్ కు, ఫిల్మ్ జర్నలిస్టులకు కూడా అవార్డులు అందచేయబోతున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు.