తెలుగు ఇండియన్ ఐడిల్ న్యాయనిర్ణేతల్లో నిత్యామీనన్ 23వ ఎపిసోడ్ లో మిస్ అయ్యింది. ఆమెకు బదులుగా ప్రముఖ సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొని, కంటెస్టెంట్స్ కు మార్కులు వేశారు. విశేషం ఏమంటే… మేల్ ఎనర్జీని బాలెన్స్ చేస్తూ, ఈ వారం శ్రీరామచంద్రతో కలిసి ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి హోస్ట్ చేసింది. రామజోగయ్య శాస్త్రి హాజరు కావడంతో వీకెండ్ ఎపిసోడ్స్ ను ఆయన స్పెషల్ గా ప్లాన్ చేశారు. వైష్ణవి ప్రారంభ గీతంగా ‘100 పర్శంట్ లవ్’లోని ‘తిరు తిరు గణనాథ’ గీతాన్ని ఆలపించింది. గణపతి పాటతో ఈ ఎపిసోడ్ మొదలు కావడం శుభసూచకమని చెప్పిన రామజోగయ్య శాస్త్రి, పాట సెలక్షన్ ను మెచ్చుకున్నారు. వైష్ణవి ఆ పాటను అత్యద్భుతంగా పాడటంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ న్యాయనిర్ణేతలు కితాబిచ్చారు. నిజానికి అప్పటికే వైష్ణవిని ‘జూనియర్ శ్రేయా ఘోషల్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడిల్’ అని శ్రీరామచంద్ర సంభోదించడం విశేషం. పాట పాడిన అనంతరం వైష్ణవి బెస్ట్ ఫ్రెండ్ నిత్య కళ్యాణి ఓ ఫోటో ఫ్రేమ్ ను తీసుకొచ్చి వైష్ణవికి గిఫ్ట్ గా ఇచ్చింది. పైకి అమాయకంగా కనిపించే వైష్ణవిలో ఓ అల్లరి పిల్ల కూడా ఉందని కళ్యాణి చెప్పడంతో వీరిద్దరితో కలిసి సరదాగా డాన్స్ చేయించారు. ఆ తర్వాత శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘భరత్ అనే నేను’ మూవీలోని ‘వచ్చాడయ్యో సామి’ గీతాన్ని అలపించాడు. రామజోగయ్య శాస్త్రి, కార్తీక్ ఆ పాటను మెచ్చుకున్నా, శ్రీనివాస్ ఇంకా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదనే చిన్న అసంతృప్తిని తమన్ వ్యక్తం చేశాడు. అయితే తన తల్లి వర్థంతి సందర్భంగా శ్రీనివాస్ అనాధాశ్రమానికి తన తోటి కంటెస్టెంట్స్ తో కలిసి వెళ్లి అన్నదానం చేయడాన్ని మెచ్చుకున్నాడు. తల్లిని తలుచుకుని బాధపడే కంటే ఆమె ఆశీస్సులతో ముందుకు సాగాలంటూ తమన్ హితవు పలికాడు.
వాగ్దేవిగా తెలుగు ఇండియన్ ఐడిల్ లోకి అడుగుపెట్టి వావ్ దేవి అనిపించుకున్న వాగ్దేవి ‘అ ఆ’ మూవీ నుంచి ‘నా వసంతం నీకు సొంతం’ గీతాన్ని ఆలపించింది. ఆమె పెర్ఫార్మెన్స్ కు రామజోగయ్య శాస్త్రి ఫిదా అయిపోయాడు. కార్తీక్ ఓకే అన్నాడు. తమన్ అయితే… ఓవర్ కాన్ఫిడెన్స్ తో పాటను సరిగా పాడటం లేదని విమర్శించాడు. దాంతో వాగ్దేవి కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి. అయితే అదంతా ఆమెను ఆటపట్టించడకోసమే అనేది ఆ తర్వాత తెలిసింది. అంతే కాదు… ఆమెది బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అని న్యాయనిర్ణేతలు తెలిపారు. తమన్ అయితే… రాబోయే పదిహేను, ఇరవై సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గాయనిగా వైష్ణవి గొప్ప పేరు తెచ్చుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆమెతో పాట పాడించడానికి బయట ఎంతమంది సిద్ధంగా ఉన్నారో తనకు తెలుసని తమన్ చెప్పడంతో వాగ్దేవి ఆనంద పడింది. ఈవారం చివరగా తెలుగు ఇండియన్ ఐడిల్ మాస్ హీరో జయంత్ ‘సరైనోడు’లోని ‘అతిలోక సుందరి…’ పాట పాడాడు. అతని పిచ్ బాలుగారి స్థాయిలో ఉందని తమన్ మెచ్చుకున్నాడు. ఆ తర్వాత జయంత్ కోరిక మేరకు కార్తిక్ స్టేజ్ మీదకు వెళ్ళి ‘అతిలోక సుందరి’ శాడ్ వర్షన్ అయితే ఎలా ఉంటుందో పాడి వినిపించాడు. శ్రావణ భార్గవి కోరిక మేరకు స్టెప్పులూ వేశాడు. కార్తిక్ పాడే సమయంలో అతన్ని ఎంకరేజ్ చేస్తూ తమన్ పియానో ప్లే చేయడం విశేషం.
దర్శకులతో అనుబంధాన్ని తలుచుకున్న రా. జో. శాస్త్రి!ప్రతి గీత రచయితకూ సంగీత దర్శకుడితో పాటు దర్శకుడితోనూ వేవ్ లెంగ్త్ కలవాల్సి ఉంటుంది. అప్పుడే మంచి పాటలు బయటకు వస్తాయి. ఆ విషయాన్నే రామజోగయ్య శాస్త్రి కూడా ఈ ఎపిసోడ్ లో చెప్పాడు. కంటెస్టెంట్స్ పాటలు పాడిన తర్వాత ఆ యా దర్శకులతో తనకున్న అనుబంధాన్ని తలుచుకున్నాడు. సుకుమార్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనుతో ఆ యా చిత్రాలకు పాటలు రాసే సమయంలో తమ మధ్య ఎలాంటి సంభాషణలు సాగాయో తెలిపాడు. ఆ రకంగా పాట వెనుక కథలను సూక్ష్మంగా తెలుసుకునే అవకాశం వీక్షకులకు రామజోగయ్య శాస్త్రి కారణంగా దక్కింది.