ఇవాళ్టి రోజుకో ప్రత్యేకత ఉంది. 22.02.2022! ఎటు నుండి చూసిన ఒకటే!! అంతేకాదు… ఇవాళ దర్శకుడు తేజ పుట్టిన రోజు కూడా. ఈ సందర్భంగా డి. రామానాయుడు మనవడు, సురేశ్ బాబు రెండో కొడుకు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కిస్తున్న మూవీ టైటిల్ ను ప్రకటించారు. ‘అహింస’ అనే ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే, తేజ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమాను ప్రారంభించారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానుంది. ‘విక్రమాదిత్య’ అనే పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమా కథ 1836 కాలం నాటిది. దీని షూటింగ్ 22.2.22 మధ్యాహ్నాం 2:22కు ప్రారంభమైంది. విశేషం ఏమంటే తేజ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జయం’ షూటింగ్ కూడా సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఇదే సమయంలో ప్రారంభమైంది.
‘విక్రమాదిత్య’ చిత్రం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఓ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రైలు ఆవిరిలో నుండి హీరో హీరొయిన్లు రొమాన్స్ చేస్తున్నట్లు అందులో ఉంది. ఈ కథ 1836 సంవత్సరంలోనిది అని పోస్టర్ ద్వారా తెలిపారు. ఇదే సమయంలో సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించాడు. ఈ కథ ఆ కాలం నాటిదని ఆ వంతెనకు ఈ ప్రేమ కథకు మధ్య సంబంధం ఉందని తెలుస్తోంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఈ మూవీ రూపుదిద్దుకోనుంది.