దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సీతారామం’. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలోని పాత్రలను వరుసగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ప్రతి పాత్రను వినూత్నంగా పరిచయం చేస్తుండటంతో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో అఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ పాత్రను బాలాజీగా పరిచయం చేశారు మేకర్స్. ఈ లుక్ లో కూల్ డ్రింక్ తాగుతున్న తరుణ్ భాస్కర్ చాలా ట్రెండీగా కనిపించారు. బాలాజీ పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో కూడా ఆసక్తికరంగా వుంది. ”బాలాజీ హై నా… సబ్ సంభాల్ లేగా (బాలాజీ వున్నాడు.. అంతా చూసుకుంటాడు) అని తరుణ్ భాస్కర్ చెప్పిన డైలాగ్ ఆయన పాత్రపై క్యూరియాసిటీని పెంచింది. ‘సీతారామం’లోప్రతి పాత్ర కోసం మేకర్స్ తీసుకున్న శ్రద్ధ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అర్దమౌతుంది. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.