తమిళ్ నిర్మాత వారాహి ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నిరోజులుగా అతను ఒక మహిళను పెళ్లి చేసుకోమని వేధిస్తుండడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ లో పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన వారాహి.. చెన్నై విరుగంబక్కం నటేసన్ నగర్‌లో ఉన్న బహుళ అంతస్థుల భవనంలో నివసిస్తున్నాడు.
అదే ప్లాట్ లో ఉంటున్న రాణి (31) అనే మహిళను అతడు కొన్నిరోజులుగా ప్రేమించమని, వివాహం చేసుకోమని వేధిస్తున్నాడు. అయితే ఈ పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, తనను వదిలేయమని రాణి చెప్పగా .. పెళ్లి చేసుకోపోతే చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన రాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో తెలిపింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన విచారణలో నిర్మాత రాణిని వేధించినట్లు నిర్ధారించారు.దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.