కువైట్ లో తెలుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక పెద్ద తెలుగు సంఘం ‘తెలుగు కళా సమితి’. కోవిడ్ తర్వాత ఈ సంస్థ మొదటిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత విభావరి ‘సుస్వర తమనీయం’. మైదాన్ హవల్లీ లోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. యువతను ఉర్రూతలూగిస్తున్న సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ యస్.యస్. తమన్ ఆధ్వర్యంలో ప్రముఖ గాయని గాయకులు శ్రీ కృష్ణ, సాకేత్, పృథ్వి చంద్ర, విమల రోషిని, శ్రీ సౌమ్య, శృతి రంజని, మనీష, హారిక నారాయణ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. జూన్ మూడున జరిగిన ఈ మెగా ఇవెంట్ లో 1500 మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. వివిధ దేశాల్లోని తెలుగు సంస్ధల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణ.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కమల్ సింగ్ రాథోడ్ కువైట్ లో తెలుగు కళా సమితి తెలుగు సంస్కృతి సంప్రదాయ విలువలను కాపాడుతూ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేసారు.
తెలుగువారి మనసుల్లో పాటల రూపంలో మనసును తన స్వరంతో సేదతీరుస్తూ చిరస్థాయిగా నిలిచిపోయిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, అద్భుత కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి తెలుగు కళా సమితి సభ్యులందరు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తమన్ బీట్స్ తో పాటు పాటలతో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం దద్దరిల్లింది. సభ్యుల కేరింతలు, నృత్యాలు, ఆనందో త్సాహాలతో కన్నుల పండుగగా తమన్ సుస్వర తమనీయం ఆద్యతం అలరించింది. ఈ సందర్భంగా తెలుగు కళా సమితి స్మారక చిహ్నమైన ‘సావెనీర్’ వార్షిక సంచికను తెలుగు కళా సమితి కార్యవర్గం విడుదల చేసింది.