Takkar: ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘టక్కర్’. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీ. జీ. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడీ విడుదల తేదీ వాయిదా పడింది. ‘టక్కర్’ను జూన్ 9న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు.
ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ మూవీ టీజర్, లిరికల్ సాంగ్ వీడియోస్ కు ప్రేక్షకుల నుండి చక్కని స్పందన లభిస్తోంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విగ్నేష్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.