తెలుగు చిత్ర పరిశ్రమలో బెల్లంకొండ సురేష్ బాబు కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా పరిచయమైన శ్రీనివాస్ హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు గణేష్ బాబు హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. గణేష్ బాబు హీరోగా ‘స్వాతిముత్యం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో గణేష్ కు జోడీగా వర్ష బొల్లమ్మ నటిస్తుంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొంటున్నాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ప్రేమ పెళ్లి జీవితం విషయంలో విభిన్నమైన ఆలోచనలున్న ఓ యువకుడి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో అందమైన ప్రేమకథను చూపించనున్నారని అర్ధమవుతోంది. ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్ బాలమురళిగానూ, వర్ష బొల్లమ్మ భాగ్యలక్ష్మిగానూ కనిపించబోతున్నారు.
ఇదిలా ఉండగా.. ఇవాళ ఈ చిత్రం నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. ‘నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా .. నీ మత్తులో మళ్లీ పడి లేస్తూ ఉన్నా’ అంటూ ఈ పాట సాగుతోంది. కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. ఈ పాటను అర్మాన్ మాలిక్ – సంజన ఆలపించారు. నటీనటులపై ఈ పాటను చిత్రీకరించారు. పూర్తి సాంగ్ ను ఈ నెల 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. సితార వంటి పెద్ద బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాతోనే హీరోగా పరిచయమవుతున్న బెల్లంకొండ గణేశ్, తొలి ప్రయత్నంలోనే హిట్ కొడతాడేమో చూడాలి.