Nandini reddy: ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా తెరకెక్కింది ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం. ఈ నెల 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘ప్రాజెక్ట్ కె’ లాంటి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలోనే ‘అన్నీ మంచి శకునములే’ లాంటి చిన్న సినిమా చేయడం గురించి తొలుత స్వప్న మాట్లాడుతూ, “నిజానికి ఏ సినిమానూ చిన్న సినిమా, పెద్ద సినిమా అని వేర్వేరుగా చూడలేం. మాకు ఆ తేడా లేదు. ‘ప్రాజెక్ట్ కే’ ఖచ్చితంగా చాలా హ్యూజ్ ప్రాజెక్ట్. మేం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో మొదలయ్యాం. మా జీవితం టర్న్ తీసుకున్నది ఆ సినిమాతోనే. మా వరకు అది మాకు బిగ్గెస్ట్ మూవీ. మంచి కథ చేయడం ముఖ్యం. అలా ఒక మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘అన్నీ మంచి శకునములే’ చేశాం. అయితే ఒకటి చెప్పాలి. ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేయాలనే ఇష్టం కానీ బ్యాండ్ విడ్త్ గానీ మాకు లేదు. ఒక సినిమా చేస్తున్నపుడు దర్శకుడికి సపోర్ట్ గా వెనుక ఉండటం మాకు ఇష్టం. అయితే కరోనా వలన మూడు సినిమాలు ఒకసారి అవ్వడం జరిగింది. ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే… వేసవిలో మన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి ఓ పది రోజులు హాయిగా గడిపి వస్తే ఆ జ్ఞాపకం ఎలా ఉంటుందో ఇది అలా వుంటుంది” అన్నారు.
ఈ సినిమా నేపథ్యం గురించి ప్రియాంక చెబుతూ, “ఈ మూవీ అంతా కునూర్ హిల్ స్టేషన్ లో జరుగుతుంది. చిన్నప్పుడు నాన్నగారితో పాటు ఊటీ లాంటి ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళం. ఎప్పటి నుంచో హిల్ స్టేషన్ లో ఒక ఫ్యామిలీ స్టోరీ చేయాలని ఉండేది. నందిని చెప్పిన కథ దీనికి సరిగ్గా సూట్ అయ్యింది. హిల్ స్టేషన్ లో సినిమా చేయాలనే కోరిక దీనితో తీరింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ టౌన్ ని క్రియేట్ చేసింది నందిని. చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఓ చిన్న ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళుతుంది” అని తెలిపింది.
‘సీతారామం’ మూవీ విజయం గురించి స్వప్న మాట్లాడుతూ, “ఆ సినిమా విజయం గొప్ప తృప్తిని ఇచ్చింది. అందులో ప్రతి అడుగు ఒక సవాల్. పర భాష హీరో, ఖరీదైన లొకేషన్స్, మార్కెట్ కు ఎదురీత… ఇలా ప్రతీది ఒక సవాలే. ఆ ఇలాంటి సమయంలో ‘సీతారామం’ మరో స్థాయి తృప్తిని ఇచ్చింది. మనం నమ్మింది జరిగిందనే తృప్తి అది. ఆ సినిమా స్టార్ కాస్ట్ విషయంలో నాన్నగారి సలహాలు తీసుకున్నాం. ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ ని పెడితే బావుంటుందనేది నాన్నగారి ఆలోచన. ఆయన సినిమాలని ఎలా చేసేవారో అవన్నీ కలిపే మాకు వచ్చాయని భావిస్తున్నాం. మేము అందరం ఆ విషయంలో కలిపే నిర్ణయం తీసుకుంటాం” అని చెప్పారు. వైజయంతీ మూవీస్ కి 50 ఏళ్ళు పూర్తయ్యింది, అలానే అశ్వనీదత్ వారసులుగా స్వప్న, ప్రియాంక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పదేళ్ళు అయ్యింది. దాని గురించి వివరిస్తూ, “బడ్జెట్ విషయంలో ఇంకా మేం పర్ ఫెక్ట్ కాలేదు. కథ డిమాండ్ చేసిందని ఒక్కోసారి ఎక్కువ ఖర్చు పెడుతుంటాం. ‘మహానటి’ సినిమా తీసినప్పుడు నాన్నగారితో 10 కోట్లలో అయిపోతుందని చెప్పాం. ఆయన నవ్వి రూ. 25 కోట్ల లోపల తీయండి అన్నారు. పేపర్ మీద చాలా పద్దతి ప్రకారమే మొదలుపెడతాం. కానీ కథ డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టు పెట్టాల్సిందే. నాన్నగారు 50 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇవాళ మేం సినిమాలు తీస్తున్నాం. ఆయన ఏ రోజు లెక్కలు వేసుకోలేదు. బహుశా అదే మాకు వచ్చింది. లెక్కలు వేసుకునే వ్యాపారాలు చాలా వున్నాయి. సినిమాల్లోకి వచ్చామంటే అది ప్యాషన్ తోనే” అని అన్నారు.
‘తొలిప్రేమ’ ఫేమ్ వాసుకి రీఎంట్రీ గురించి స్వప్న చెబుతూ, “వాసుకి నా స్నేహితురాలు. మళ్ళీ నటన ఎప్పుడని అడిగినప్పుడల్లా పిల్లలు… బాధ్యతలు అనేది. ఇప్పుడు పిల్లల్ని అండర్ గ్రాడ్యుయేషన్ కి పంపించింది. అదే సమయంలో నందిని ఆ పాత్ర చెప్పినప్పుడు తను ఓకే చెప్పడం జరిగింది” అని తెలిపింది. ప్రభాస్ తో నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ 70 శాతం పూర్తయ్యిందని, ‘జగదేక వీరుడు – అతిలోక సుందరి -2’ చేయాలనే కోరిక తమ అందరిలో ఉందని స్వప్న, ప్రియాంక చెప్పారు.