అనేక తెలుగు చిత్రాలలో అక్క, వదిన, పిన్ని, అత్త, అమ్మ పాత్రల్లో ఒదిగిపోతూ అందరినీ అలరించారు నటి సురేఖా వాణి. ఇప్పటికీ పలు చిత్రాలలో సురేఖ కేరెక్టర్ రోల్స్ లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వర్ధమాన తారల చిత్రాలలో సురేఖా వాణి ఏదో ఒక పాత్రలో తప్పకుండా కనిపిస్తూ ఉంటారు. తనదైన అభినయంతో ఆకట్టుకుంటూ సురేఖ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు.
సురేఖా వాణి 1977 ఏప్రిల్ 29న విజయవాడలో జన్మించారు. చిన్నతనం నుంచీ సురేఖ చలాకీగా ఉంటూ అందరినీ ఆకర్షించేవారు. చదువుకొనే రోజుల్లోనే పలు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని అలరించారు. కొన్ని సినిమాల్లో నటించినా, బుల్లితెర సీరియల్ ‘మొగుడ్స్ – పెళ్ళామ్స్’లో శివాజీరాజా సరసన నటించాక సురేఖావాణికి మంచి గుర్తింపు లభించింది. ఆ సీరియల్ కు దర్శకత్వం వహించింది సురేఖావాణి భర్త సురేశ్ తేజ. ఈ సీరియల్ సక్సెస్ తరువాత మెల్లగా సినిమాల్లోనూ సురేఖకు అవకాశాలు లభిస్తూ వచ్చాయి. సురేఖ, సురేశ్ దంపతులకు ఒక పాప. పేరు సుప్రిత. కొంతకాలం క్రితం సురేశ్ తేజ అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి నుంచీ తల్లీకూతుళ్ళు ఒకరికొకరు తోడుగా సాగుతున్నారు. ప్యాండమిక్ టైమ్ లో సురేఖావాణి తన కూతురు సుప్రితతో కలసి చేసిన డాన్స్ అప్పట్లో విశేషంగా వైరల్ అయింది. భవిష్యత్ లో తన తల్లి బాటలో పయనిస్తూ సుప్రిత కూడా నటనలో అడుగు పెడుతుందేమో! ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికే సురేఖా వాణి తపిస్తున్నారు.