కమెడియన్‌గా తన కెరీర్ ప్రారంభించిన సునీల్.. అప్పట్లో ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేశాడు. ఎనలేని క్రేజ్ సంపాదించాడు. కామెడీ పండాలంటే, సునీల్ ఉండాల్సిందేనన్న స్థాయికి ఎదిగాడు. అంత క్రేజ్ ఉండడం వల్లే, హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. ‘అందాల రాముడు’తో తన అదృష్టం పరీక్షించుకోగా.. అది మంచి విజయం సాధించింది. అనంతరం రాజమౌళితో చేసిన ‘మర్యాదరామన్న’ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో.. ఇక హీరోగానే కెరీర్ కొనసాగించాలని సునీల్ నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని హిట్ అయ్యాయి కానీ, మిగతావి మాత్రం ఘోర పరాజయాల్ని చవిచూశాయి. సునీల్ దాదాపు ఫేడవుట్ అయ్యే స్థాయికి వెళ్ళిపోయాడు.
దీంతో, సునీల్ తిరిగి మళ్ళీ తన పాత జోన్‌కే వచ్చేశాడు. కమెడియన్‌గా పలు సినిమాలు చేశాడు. ‘కలర్ ఫోటో’తో విలన్‌గా మారిన ఇతను.. ‘పుష్ప’లో సిసలైన విలనిజం చూపించాడు. ‘ఎఫ్3’ మరోసారి నవ్వించేందుకు రెడీ అయిన సునీల్.. హీరోగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అవును, ఈ విషయాన్ని స్వయంగా సునీల్ ఎఫ్3 ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. త్వరలోనే తాను హీరోగా రీఎంట్రీ ఇస్తున్నానని, ఓ మంచి ప్రాజెక్టుతో కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నానని సునీల్ వెల్లడించాడు. అయితే, ఆ ప్రాజెక్ట్ వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. మరి, ఈ సినిమాతోనైనా సునీల్ హీరోగా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.