Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!

Sukumar

Sukumar

తెలుగు చిత్రసీమలో సహజమైన కథనం, గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలను రా అండ్ రస్టిక్ శైలిలో వెండితెరపై ఆవిష్కరిస్తున్న యువ దర్శకులలో శ్రీకాంత్ ఓదెల ఒకరు. ఆయన సినీ ప్రయాణంలో లెక్కల మాస్టారు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పాత్ర అత్యంత కీలకం అని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. శ్రీకాంత్ చిన్నతనంలో ‘జగడం’ సినిమా చూసినప్పటి నుంచే సినిమాలపై బలమైన ఆసక్తి పెంచుకున్నారు. ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఎలాగైనా సుకుమార్ వద్దే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాలనే పట్టుదలతో హైదరాబాద్ వచ్చారు. సుకుమార్ అపాయింట్‌మెంట్ కోసం దాదాపు నాలుగేళ్లపాటు రోజూ ఉదయం ఆయన గేటు వద్దే నిలబడ్డారు. చివరకు శ్రీకాంత్ పట్టుదలను గమనించిన సుకుమార్, ఒక షార్ట్ ఫిల్మ్ చేసి చూపించమన్నారు. ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్ నచ్చడంతో తన దర్శకత్వ విభాగంలోకి ఆహ్వానించారు.

‘నాన్నకు ప్రేమతో’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ, షూటింగ్ ఎక్కువగా విదేశాల్లో జరగడంతో స్థానికంగా ఉండి ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో పాలుపంచుకున్నారు. ‘రంగస్థలం’లో కాస్ట్యూమ్ విభాగం సమన్వయకర్తగా, క్షేత్రస్థాయి సహాయకుడిగా పూర్తిస్థాయిలో పనిచేశారు. వేలమంది జూనియర్ ఆర్టిస్టులు, భారీ సెట్టింగులు, లొకేషన్ మేనేజ్‌మెంట్‌లో సుకుమార్ పని విధానాన్ని దగ్గరగా చూసి అవగాహన పెంచుకున్నారు.

సుకుమార్ మేకింగ్ స్టైల్ తన రక్తంలో అంతర్లీనంగ ఉందని శ్రీకాంత్ పేర్కొన్నారు. సుకుమార్ ఆలోచనలు అత్యంత ఉన్నతమైన స్థాయిని తాకుతాయని, ఆయన క్రియేటివ్ మేధస్సును అందుకోవడం ఎవరికైనా సవాలేనని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, సుకుమార్ నుంచి గ్రహించిన ఆ సూక్ష్మమైన ఫిలిం మేకింగ్ నైపుణ్యమే తనను ఈ స్థాయికి నడిపిస్తోందని వెల్లడించారు. కథలోని భావోద్వేగాలను సహజంగా, బలంగా ప్రెసెంట్ చేయాలనే దృక్పథం గురువు వద్ద నేర్చుకున్నదే అని చెప్పారు శ్రీకాంత్. సుకుమార్‌తో పాటు కృష్ణవంశీ, ఎస్.ఎస్. రాజమౌళి, శేఖర్ కమ్ముల, పూరి జగన్నాథ్ వంటి దర్శకుల కథన శైలులు కూడా తన ఆలోచనలపై ప్రభావం చూపాయని శ్రీకాంత్ తెలిపారు.