Srileela Kiss: తెలుగమ్మాయి శ్రీలీల నటించిన తొలి కన్నడ చిత్రం ‘కిస్’. 2019లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు గాను సైమా అవార్డ్స్‌లో శ్రీలీల డెబ్యూ హీరోయిన్‌గా అవార్డ్ కూడా గెలుచుకుంది. ఆపై ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోహన్ సరసన హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేశాడు. దాంతో టాలీవుడ్ ప్రముఖులు ఈ బ్యూటీ కోసం బారులు తీరారు. పూజా హెగ్డే, రష్మిక వంటి తారలు టాప్ స్టార్లతో జతకట్టడానికే ఆసక్తి చూపిస్తుండంతో శ్రీలీలకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం అమ్మడు నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా చేస్తోంది.
Read Also: Ranbir Kapoor : గడ్డం కొంపముంచింది.. కెరీర్లోనే భారీ డిజాస్టర్ అందుకున్న టాప్ హీరో
అలాగే మాస్ మహారాజా రవితేజతో ‘ధమాకా’లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరుగా నటించింది. ఈ సినిమా ఈ నెల 23న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తెలుగునాట అమ్మడికి పెరుగుతున్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో శ్రీలీల నటించిన తొలి కన్నడ చిత్రం ‘కిస్’ను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. విరాట్ హీరోగా ఎ.పి అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కిస్’ను సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్‌తో కలసి ఎ.పి. అర్జున్ డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. మరి శ్రీలీల ‘కిస్’ ప్రేక్షకులకు కిక్ ఇస్తుందా? లేక ఇమేజ్‌ను డామేజ్ చేస్తుందా అన్న విషయం తెలియాలంటే ఈనెల 17 వరకూ ఆగాల్సిందే.