(ఆగస్టు 4న కిశోర్ కుమార్ జయంతి)
గాయకునిగా కిశోర్ కుమార్ బాణీ విలక్షణమైనది. కిశోర్ గళం కిర్రెక్కించేది. ఆయన పాట పరవశింప చేసేది. నటన మత్తు చల్లింది. కిశోర్ పాటతోనే దేవానంద్, రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్స్ వెలిశారు. కిశోర్ గానంతోనే అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. కిశోర్ గాత్రంలోని వైచిత్రిని పట్టుకొని, దానినే సాధన చేస్తూ కొందరు తరువాతి తరం గాయకులూ జయకేతనం ఎగురవేశారు. ఒక్కసారి కిశోర్ గానంతో పరిచయమైతే చాలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. మనసు బాగోలేనప్పుడు వింటే సేదతీరుతాం. హుషారుగా ఉన్నప్పుడూ కిశోర్ పాటతో సాగాలనిపిస్తుంది. ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకోవాలని భావించేవారూ ఆయన పాటతోనే సావాసం చేస్తూ ఉంటారు. ఎలా చూసినా, కిశోర్ గాత్రం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది.
ప్రఖ్యాత హిందీ నటుడు అశోక్ కుమార్ చిన్న తమ్ముడు కిశోర్ కుమార్. కిశోర్ అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ. కిశోర్ తండ్రి కుంజాలాల్ గంగూలీ ఆ రోజుల్లో పేరుమోసిన లాయర్. కిశోర్ కుమార్ చిన్నతనంలోనే వాళ్ల అన్నయ్య హిందీ చిత్రసీమలో నటునిగా రాణిస్తున్నారు. దాంతో కిశోర్ కూడా అన్న బాటలో పయనిస్తూ ముంబయ్ చేరారు. చిత్రసీమలో ప్రవేశించిన తరువాతే అభాస్ పేరును కిశోర్ అని మార్చుకున్నారు. తొలి రోజుల్లో కోరస్ లో పాడేవారు. తరువాత అన్న నటించిన చిత్రాల్లో చిన్నాచితకా వేషాలూ వేశారు. నటునిగా దేవానంద్ కు మంచి పేరు సంపాదించిపెట్టిన ‘జిద్ది’ చిత్రంలో ఖేమ్ చంద్ ప్రకాశ్ స్వరకల్పనలో కిశోర్ కుమార్ తొలిసారి నేపథ్యగాయకునిగా మారారు. “మర్నే కీ దువాయే క్యో మాంగూ…” అనే పాటతో కిశోర్ మంచి గుర్తింపు సంపాదించారు. ఇదే చిత్రం ద్వారా ప్రాణ్, కామినీ కౌశల్, లతా మంగేష్కర్ కు కూడా మంచి గుర్తింపు లభించడం విశేషం. కిశోర్ కు పాటలు పాడి, గాయకునిగా మంచి పేరు సంపాదించాలని ఉండేది. కానీ, ఆయన పెద్దన్న అశోక్ కుమార్ కు మాత్రం తమ్ముణ్ణి తనలాగే నటునిగా చూడాలనుకొనేవారు. అన్న ప్రోత్సాహంతో కిశోర్ దాదాపు 22 చిత్రాలలో హీరోగా నటించారు. వాటిలో 16 చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అందువల్ల కిశోర్ కు నటన అంటే ఏ మాత్రం ఆసక్తి లేకుండా పోయింది. చిత్రంగా కిశోర్ కు నటనపై అనాసక్తి నెలకొన్న సమయంలో విజయాలు ఆయనను పలకరించసాగాయి. “లడ్కీ, నౌఖరీ, బాప్ రే బాప్, న్యూ ఢిల్లీ, నయా అందాజ్, భాయ్ భాయ్, ఢిల్లీ కా థగ్, మిస్టర్ ఎక్స్ ఇన్ బొంబాయ్, గంగా కీ లెహరే, హమ్ సబ్ ఉస్తాద్ హై, ప్యార్ కియే జా, పడోసన్, ఛల్తీ కా నామ్ గాడీ” వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి.
తన అన్నలు అశోక్ కుమార్, అనూప్ కుమార్ తో కలసి కిశోర్ కుమార్ ‘ఛల్తీ కా నామ్ గాడీ’ చిత్రంలో వినోదం పండించారు. ఇది ఆయన సొంత చిత్రం కావడం విశేషం. మాలా సిన్హా, వైజయంతిమాల, మధుబాల, కుమ్ కుమ్ తో కిశోర్ నటించిన పలు చిత్రాలు విజయపథంలో పయనించాయి. కిశోర్ కుమార్ వాయిస్ లోని గమ్మత్తును పసికట్టి, అందుకు తగ్గ బాణీలు కట్టారు ఎస్.డి.బర్మన్. ముఖ్యంగా ‘యోడెలింగ్’ అంటే గాత్రాన్ని లో పిచ్ నుండి హై పిచ్ లోకి తీసుకు వెళ్లి, అక్కడే విన్యాసాలు చేయించడం- ఇందులో కిశోర్ కుమార్ నిష్ణాతుడు. కిశోర్ తో అలాంటి విన్యాసాలు భలేగా చేయించారు ఎస్డీ బర్మన్. అలా బర్మన్ స్వరకల్పనలో రాజేశ్ ఖన్నా ‘ఆరాధన’ కోసం మూడు పాటలు పాడారు కిశోర్. సినిమా విడుదలయ్యాక ఆ మూడు పాటలు – “మేరే సప్నోంకీ రాణీ కబ్…”, “కోరా కాగజ్ థా యే మన్ మేరా…”, “రూప్ తేరా మస్తానా…” – జనాన్ని కిర్రెక్కించాయి. దాంతో హిందీ చిత్రసీమలో స్టార్ సింగర్ గా మారిపోయారు కిశోర్. అప్పటి నుంచీ ధర్మేంద్ర, రాజేశ్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ తో పాటు నాటి నవతరం కథానాయకులకూ కిశోర్ నేపథ్యగానం చేశారు. 1970 నుండి 1980ల మధ్యకాలంలో కిశోర్ పాడిన పాటలన్నీ హిట్స్ గా నిలిచాయి. నటునిగా కంటే గాయకునిగానే కిశోర్ అధికంగా సంపాదించ గలిగారు.
కిశోర్ కుమార్ కు నలుగురు భార్యలు. అందరూ నటీమణులు కావడం విశేషం. మొదటి భార్య రుమా ఘోష్ నటి, గాయని. కిశోర్, రుమా కుమారుడే తరువాతి రోజుల్లో గాయకునిగా ప్రసిద్ధి చెందిన అమిత్ కుమార్. రుమాకు విడాకులు ఇచ్చిన తరువాత నాటి మేటి అందాలతార మధుబాలను వివాహం చేసుకున్నారు కిశోర్. అయితే మధుబాల అర్ధాంతరంగా చనిపోయారు. ఆ తరువాత యోగితాబాలిని పెళ్ళాడారు కిశోర్. రెండేళ్ళ తరువాత యోగితా విడాకులు తీసుకొని, నటుడు మిథున్ చక్రవర్తిని పెళ్ళి చేసుకుంది. మరో అందాల నాయిక లీనా చందావర్కర్ ను 1980లో మనువాడారు కిశోర్. కడదాకా ఆమెతో కాపురం చేశారు. కిశోర్, లీనా తనయుడు సుమిత్ కుమార్. కిశోర్ మరణం తరువాత అమిత్, సుమిత్ తోనే లీనా ఉంటున్నారు. ఏది ఏమైనా కిశోర్ కుమార్ నటునిగా, గాయకునిగా ఎంతటి విలక్షణమైన బాణీ పలికించారో, వ్యక్తిగతంగానూ తనదైన పంథాలో సాగారు. హిందీ సంగీతం గురించి చర్చ సాగినంత కాలం కిశోర్ గానం కూడా ప్రాణం పోసుకొని ఉంటుందని చెప్పవచ్చు.