(పుట్టిన రోజు సందర్భంగా)
సినిమాకు పోస్టర్ నుదుట బొట్టు లాంటిది. అది చూడముచ్చటగా ఉంటేనే అందరి దృష్టీ దాని మీద పడుతుంది. ఇదేదో కాస్తంత కొత్తగా ఉంది! చూసేస్తే పోలా!! అనుకుంటారు. అందుకే సినిమా పోస్టర్ డిజైనింగ్ అనేది చాలా ప్రాముఖ్యతను, ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చిత్రలేఖనంలో కాకలు తీరిన యోథులు పనిచేసిన శాఖ అది. అందులోంచి వచ్చి దర్శకుడిగా ఎదిగాడు రమేశ్ వర్మ. ఆగస్ట్ 22 ఆయన పుట్టిన రోజు.
పోస్టర్ డిజైనర్ గా రమేశ్ వర్మ కెరీర్ ప్రారంభించే సమయానికి కంప్యూటర్ యుగం వేగం అందుకుంటోంది. చేతితో టైటిల్స్ రాయడం, ఫోటోలను కట్ పేస్ట్ చేసి పోస్టర్స్ డిజైన్ చేయడం తగ్గిపోయింది. అందివచ్చిన సాంకేతికతను అర్థం చేసుకుని, ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు రమేశ్ వర్మ. అతి తక్కువ కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థల ఆస్థాన డిజైనర్ గా మారిపోయాడు. అయితే… దర్శకత్వం మీద ఉన్న మక్కువ అతన్ని పోస్టర్స్ డిజైనింగ్ దగ్గర ఆపేయలేదు. మరింత ముందుకు సాగేలా చేసింది. తానే కథలు తయారు చేసుకుని, నిర్మాతలతో ఉన్న అనుబంధం కారణంగా వారికి వినిపించడం మొదలెట్టాడు. అలా రమేశ్ వర్మకు తొలి ఛాన్స్ ఇచ్చిన నిర్మాత అడ్డాల చంటి. ఆర్ట్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన చంటి….. రమేశ్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ, తరుణ్, సలోని జంటగా ‘ఒక వూరిలో… (మొదలైన ప్రేమకథ)ను నిర్మించాడు. ఆ సినిమాలోని అన్ని పాటలు అనంత్ శ్రీరామ్ రాయడం విశేషం. అలా దర్శకుడిగా 2005లో మొదలు పెట్టిన ప్రస్థానాన్ని విరామం లేకుండా సాగిస్తున్నాడు రమేశ్ వర్మ.
నాని, తనీశ్ హీరోలుగా బెల్లంకొండ సురేశ్ నిర్మించిన ‘రైడ్’తో దర్శకుడిగా రమేశ్ వర్మ తొలి విజయాన్ని అందుకున్నాడు. దానికి ముందు సంవత్సరమే భూమిక నాయికగా నటించిన ‘మల్లెపువ్వు’ సినిమాకు కథ, కథనం అందించాడు రమేశ్ వర్మ. ‘రైడ్’ సాధించిన విజయంతో ఏకంగా మాస్ మహరాజా రవితేజను డైరెక్ట్ చేసే ఛాన్స్ పొందాడు. అదే ‘వీర’ సినిమా. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం విజయం సాధించలేదు. ఆ తర్వాత చేసిన ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా సైతం నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో తమిళ సినిమా ‘రాక్షసన్’ను తెలుగులో సాయి శ్రీనివాస్ తో ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేశాడు. ఆ సినిమా చక్కని విజయాన్ని అందుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు తొలి విజయాన్ని అందించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ మధ్యలో రమేశ్ వర్మ నిర్మాతగానూ తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ‘వెన్నెల’ కిశోర్ దర్శకత్వంలో ‘జప్ఫా’ చిత్రాన్ని, నిజార్ షఫీ దర్శకత్వంలో ‘7’ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
ప్రస్తుతం మరోసారి రవితేజతో సినిమా చేస్తున్నాడు రమేశ్ వర్మ. ‘ఖిలాడీ’ పేరుతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘రాక్షసుడు’ సినిమాను నిర్మించిన కోనేరు సత్యనారాయణ… ఈ సినిమాను నిర్మించారు. అంతేకాదు… ఆయనే ‘రాక్షసుడు’ సినిమాను రమేశ్ వర్మ దర్శకత్వంలో హిందీలో నిర్మించే ఆలోచన చేస్తున్నారు. దీని కోసం అక్షయ్ కుమార్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇటీవలే తెలుగు ‘రాక్షసుడు’కు సీక్వెల్ గా ‘రాక్షసుడు -2’ చిత్రాన్నీ నిర్మించబోతున్నట్టు తెలిపారు. దీనిని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథను విజయ్ సేతుపతికి చెప్పామని, ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నామని రమేశ్ వర్మ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. నిర్మాతగానూ రమేశ్ వర్మ మరిన్ని ప్రాజెక్ట్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. దర్శకుడు మారుతీతో కలిసి ఓ కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ రమేశ్ వర్మ సినిమా నిర్మించబోతున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది.
ఓ పోస్టర్ డిజైనర్ గా చిత్రసీమలోకి అడుగుపెట్టి, దర్శక నిర్మాతగా దూసుకుపోతున్న రమేశ్ వర్మను అభినందించాలి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ‘ఖిలాడీ’, ‘రాక్షసుడు -2’ చిత్ర యూనిట్ సైతం తమ దర్శకుడికి శుభాకాంక్షలు తెలియచేసింది.