(ఆగస్టు 2న వినోదం చిత్రానికి పాతికేళ్ళు)
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రాలను రూపొందిస్తూ సంసారపక్షంగా సాగి, సెన్సార్ కత్తెరకు పనిలేకుండా చేసిన ఘనుడు దర్శక, సంగీత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. జనానికి వినోదం పంచడమే ధ్యేయంగా కృష్ణారెడ్డి చిత్రాలు సాగాయి. కొన్ని చిత్రాలలో కరుణరసం చోటు చేసుకున్నా, కృష్ణారెడ్డి సినిమా అంటే వినోదమే ప్రధానమని చెప్పవచ్చు. అందువల్లే శ్రీకాంత్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన తొలి చిత్రానికి వినోదం అనే టైటిల్ ను పెట్టారనిపిస్తుంది. అంతకుముందు కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఘటోత్కచుడు చిత్రంలో అర్జున పాత్రలో కనిపించిన శ్రీకాంత్ ఆ తరువాత పెళ్లిసందడిలో హీరోగా నటించి, ఓ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాంతో 1996లో శ్రీకాంత్ కు జనాల్లో భలే క్రేజ్ ఉండేది. అందుకు తగ్గట్టుగానే శ్రీకాంత్ చిత్రాలకు ఆదరణ సైతం లభిస్తూండేది. ఆ సమయంలో ఫ్రమ్ ఎంటర్ టైన్ మెంట్ ఫర్ ఎంటర్ టైన్ మెంట్ అంటూ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆయన మిత్రుడు కె.అచ్చిరెడ్డి మనీషా ఫిలిమ్స్ పతాకంపై వినోదం చిత్రాన్ని నిర్మించారు. పెళ్లిసందడిలో జోడీ కట్టిన శ్రీకాంత్, రవళి ఇందులోనూ జంటగా నటించారు. 1996 ఆగస్టు 2న విడుదలైన వినోదం చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
కథ విషయానికి వస్తే – రాజా తన ముగ్గురు మిత్రులతో కలసి ఓ అద్దె ఇంటిలో నివసిస్తూ ఉంటాడు. తమ ఇంటి యజమానిని పలుమార్లు మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. రాజా, కోటీశ్వరుడైన బంగారం ఏకైక కూతురు అష్టలక్ష్మిని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే తాడూబొంగరం లేని రాజాకు బిడ్డనివ్వడానికి బంగారం అంగీకరించడు. విదేశాల్లో ఉండే ఓ పెద్ద కోటీశ్వరునికి తన కూతురునిచ్చి పెళ్ళి చేయించాలనుకుంటాడు బంగారం. అయితే ఆ కోటిశ్వరుని బురిడీ కొట్టించి, ఆ ఇంటి పనిమనిషిని పెళ్ళి చేసుకొనేలా చేస్తారు రాజా, అతని మిత్రబృందం.బంగారంకు ఓ కవల సోదరుడు ఉన్నట్టుగా నాటకం ఆడి, చివరకు అష్టలక్ష్మిని పెళ్లాడాలనుకుంటాడు రాజా. అయితే ఈ లోగా అదంతా నాటకం అని బంగారంకు తెలిసిపోతుంది. అయితే కూతురు అంటే ప్రాణంపెట్టే బంగారంకు తన బిడ్డ కోసం రాజా ఎన్ని అవతారాలు ఎత్తాడో తెలుసుకొని అతని ప్రేమలో నిజాయితీ ఉందని గ్రహిస్తాడు. అష్టలక్ష్మి కోరుకున్నట్టుగానే రాజాతో పెళ్ళి జరిపించడంతో కథ సుఖాంతమవుతుంది.
కథ ఇంతేనా అనిపించినా, ఈ ఇంతకథనే వినోదంతో రంగరించి, కృష్ణారెడ్డి తెరపై నవ్వుల నావలు నడిపారు. ఆయన కథలకు తగ్గ సంభాషణలు పలికించడంలో మేటి అనిపించుకున్న దివాకర్ బాబు రచన ఈ సినిమానూ వినోదంతో రంగరించేసింది. తెలుగు చిత్రసీమలో నేడు తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అంతకు ముందు సంకల్పం, సహనం అనే తెలుగు చిత్రాలలో నటించినా, అంతగా గుర్తింపు లభించలేదు. పైగా ఆ చిత్రాలలో ప్రకాశ్ రాజ్ కు వేరేవారు డబ్బింగ్ చెప్పారు. ఇందులో తొలిసారి తన గళంలో తెలుగు వినిపించి, తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా ఆకట్టుకోగలిగారు. ఆ తరువాత నుంచీ తెలుగునాట ప్రకాశ్ రాజ్ సక్సెస్ రూటులో సాగిపోతూనే ఉన్నారు. ఈ చిత్రం శ్రీకాంత్ కు హీరోగా మరో ఘనవిజయాన్ని అందించింది. అంతకు ముందు ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలలో సందడిచేసిన కోట శ్రీనివాసరావు, ఆలీ, బ్రహ్మానందం, బాబూమోహన్, భరణి, ఏవీయస్, గుండు హనుమంతరావు వంటివారు ఈ సినిమాలోనూ వినోదం పంచారు. ఇక ఇందులో శ్రీకాంత్ మిత్రులుగా శివాజీరాజా, ఉత్తేజ్, బండ్ల గణేశ్ నటించారు. ఇతర పాత్రల్లో వై.విజయ, రాళ్లపల్లి, మల్లికార్జునరావు, గౌతమ్ రాజు కనిపించారు. ఈ సినిమాలో దొంగగా కొద్దిసేపు కనిపించినా ఒక్క మాట కూడా లేకుండా కేవలం తన ముఖకవళికలతో బ్రహ్మానందం ఆకట్టుకున్న తీరును ఎవరూ మరచిపోలేరు. ఈ సినిమా ఆయనకు బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డును సంపాదించి పెట్టింది.
ఎస్వీ కృష్ణారెడ్డి స్వరకల్పనలో రూపొందిన ఈ చిత్రంలోని హాయ్ లైలా ప్రియురాలా…, మల్లెపూల వాన…, జింగిలాలో ఏ జింగిలాలో…, చలాకీ కలువా కలువా…, కమ్మగ సాగే స్వరమో… అని మొదలయ్యే ఐదు పాటలూ అలరించాయి. ఈ సినిమా ఇప్పటికీ అడపా దడపా బుల్లితెరపై ప్రత్యక్షమై అలరిస్తూనే ఉంది.