ఇప్పుడంటే పాన్ ఇండియా మూవీస్ అని సౌత్ సినిమాలు సైతం ఇతర భాషల్లోకి తెరకెక్కుతున్నాయి. కానీ, ఆ రోజుల్లో ఈ ముచ్చట అంతగా లేదు. దాంతో ఉత్తరాది హిట్ మూవీస్ దక్షిణాదికి, ఇక్కడ సక్సెస్ సాధించిన సినిమాలు నార్త్ కు ప్రయాణం కట్టి ఆ యా భాషల్లో రూపొంది అలరించేవి. అలా తమిళనాట ఘనవిజయం సాధించిన భాగ్యరాజా చిత్రం ‘ఎంగ చిన్న రాస’ సినిమా హిందీలో ‘బేటా’గా రూపొంది అనూహ్య విజయం సాధించింది. భాగ్యరాజా నటించిన చిత్రం తెలుగులో ‘చిన్నరాజా’ పేరుతో అనువాదమై విజయం సొంతం చేసుకుంది. చిత్రమేంటంటే, ‘బేటా’ను చూసి మన తెలుగువారు మళ్ళీ మనసు పారేసుకొని, ఆ రీతిన సదరు అనుకరణతో వెంకటేశ్ హీరోగా ‘అబ్బాయిగారు’ తీసి అలరించారు. అలా మురిపించిన ‘బేటా’ 1992 ఏప్రిల్ 3న విడుదలైంది. అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది.
మరో మాట చెప్పాలంటే, అసలు ‘ఎంగ చిన్న రాస’ చిత్రానికి కూడా ఏయన్నార్, సావిత్రి నటించిన ‘అర్ధాంగి’ మూలం అని చెప్పవచ్చు. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఆ సినిమా తెలుగు తరువాత తమిళంలో ‘పెన్నిన్ పెరుమాల్’గా రూపొందింది. అసలు ఈ చిత్రాలకే బెంగాలీలో మణిలాల్ బెనర్జీ రాసిన ‘స్వయంసిద్ధ’ కథ ఆధారం. ఇక ‘బేటా’ కథ విషయానికి వస్తే- రాజుకు చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. అతని తండ్రి ప్రేమ్ చౌదరి లక్ష్మీదేవిని రెండో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెనే రాజు తల్లిగా భావిస్తాడు. లక్ష్మీదేవి మాత్రం తన సొంత కొడుకును బాగా చూసుకుంటూ, రాజును అమాయకుణ్ణి చేసి ఆటాడిస్తూ ఉంటుంది.
అందుకు లక్ష్మి అన్న తోతారామ్ కూడా సహకరిస్తూ ఉంటాడు. అందరి ముందు రాజును సొంతకొడుకు కన్నా మిన్నగా చూసుకుంటున్నట్టు అభినయిస్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ చౌదరి అసమర్థునిగా ఇంట్లోనే ఉంటాడు. పెరిగి పెద్దయిన తరువాత కూడా రాజుకు తల్లి మాటే వేదం. ఓ సారి అతను సరస్వతి అనే అమ్మాయిని ఓ పెళ్లిలో చూసి ప్రేమలో పడతాడు.
తరువాత కొన్ని పరిణామాలు జరిగాక రాజు, సరస్వతి పెళ్ళి అవుతుంది. సరస్వతి ఆ ఇంట కాలు మోపిన తరువాత లక్ష్మీదేవి అసలు రూపం బయట పడుతుంది. మామ ప్రేమ్ ను చీకటి గదిలో నుండి విడిపించి బయట ప్రపంచం చూపిస్తుంది. భర్తకు కూడా అత్త నిజస్వరూపం చూపించాలని ప్రయత్నిస్తుంది. కానీ, అతను తల్లి అంటే ఎక్కడలేని ప్రేమతో ఉంటాడు.
సరస్వతిని చంపాలని విషం కలిపిన పాలు ఇవ్వ చూస్తారు. అది తెలిసిన సరస్వతి రచ్చ చేస్తుంది. అయితే తన తల్లి అలాంటిది కాదని, ఆ పాలు రాజు తాగుతాడు. ప్రాణపాయ స్థితిలో ఉన్న రాజును ఆసుపత్రికి తీసుకుపోయేందుకు సరస్వతి సిద్ధమవుతుంది. ఆస్తి తమ పేర రాయాలని లక్ష్మీదేవి అసలు కొడుకు, అతని మామ సరస్వతిని అడ్డగిస్తారు. అప్పుడే ఆమెను ఆసుపత్రికి పోయేందుకు అనుమతిస్తామనీ చెబుతారు. దాంతో పత్రాలపై సంతకం పెట్టాలని సరస్వతి సిద్ధమవుతుంది. అప్పటికే పశ్చాత్తాపంతో కుంగిపోయిన లక్ష్మీదేవి సంతకం పెట్టవద్దని చెబుతుంది.
లక్ష్మిదేవి సొంత కొడుకు రమేశ్, ఆమెనే చంపాలని చూస్తాడు. అది చూసిన రాజు అతని బారి నుండి తల్లిని కాపాడుతాడు. తరువాత ఆసుపత్రిలో రాజు కోలుకుంటాడు. ఆస్తిని, తన తండ్రి ప్రేమ్ కు అప్పగించి, రాజు, సరస్వతి వేరే ఊరు వెళ్ళాలనుకుంటారు. అయితే తన తప్పు క్షమించమని, తనకు తన కొడుకు రాజు కావాలని లక్ష్మీదేవి ప్రాధేయపడడంతో అందరూ సంతోషంగా కలసి ఉండడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో రాజుగా అనిల్ కపూర్, సరస్వతిగా మాధురీ దీక్షిత్, లక్ష్మీదేవిగా అరుణాఇరానీ నటించారు. మిగిలిన పాత్రల్లో లక్ష్మీకాంత్ బెర్డే, ప్రియా అరుణ్, అనుపమ్ ఖేర్, కునికా, ఆకాశ్ ఖురానా, ఆది ఇరానీ , రాజీవ్ మెహతా, జాక్ గౌడ్, గుర్బచన్ సింగ్ నటించారు. కె.భాగ్యరాజా కథతో రూపొందిన ఈ చిత్రానికి కమలేశ్ పాండే, నౌషిర్ కటావు మాటలు రాశారు. అశోక్ తకేరియాతో కలసి దర్శకుడు ఇంద్రకుమార్ ఈ సినిమాను నిర్మించారు.
ఈ చిత్రానికి ఆనంద్-మిలింద్ సంగీతం సమకూర్చారు. దిలీప్ తాహిర్, నక్ష్ లైల్ పురి, దేవి కోహ్లి పాటలు రాశారు. ఇళయరాజా బాణీల్లో రూపొందిన ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’లోని “అబ్బ నీ తియ్యనీ దెబ్బ…” బాణీల్లో “ఢక్ ఢక్ కర్నే లగా…” పాట తెరకెక్కింది. అలాగే ‘ఎంగ చిన్నరాస’లోని “కొండ సెవల్ కూవు…” ట్యూన్స్ ఆధారంగా “కోయిల్ సే తేరి బోలీ…” పాట స్వరపరిచారు. ఈ రెండు పాటలు అప్పట్లో జనాన్ని భలేగా ఊపేశాయి. మిగిలిన పాటల్లో “సయ్యాజీ సే చుప్కే…”, “యే దో దిల్ హై చంచల్…”, “ధడ్కనే సాన్సే జవానీ…”, “కిత్ నా ప్యారా ఏ చెహ్రా…”, “నచ్ ముడియా…” వంటి పాటలు అలరించాయి. బెస్ట్ యాక్టర్ గా అనిల్ కపూర్, బెస్ట్ యాక్ట్రెస్ గా మాధురీ దీక్షిత్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అరుణా ఇరానీ ఫిలిమ్ పేర్ అవార్డులు అందుకున్నారు. “ఢక్ ఢక్…” పాడిన అనురాధ పడ్వాల్ ఉత్తమగాయనిగా, ఆ పాటకు నృత్యం సమకూర్చిన సరోజ్ ఖాన్ బెస్ట్ కొరియోగ్రాఫర్ గానూ ఫిలిమ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. 1992లో తెరకెక్కిన హిందీ చిత్రాల్లో రూ.20 కోట్లు వసూలు చేసిన ‘బేటా’ టాప్ గ్రాసర్ గా నిలచింది.