‘అమ్మను మించిన దైవం లేదు’ అన్నది ఆర్యోక్తి! అదే పంథాలోనే ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యాకులు సాగుతూ ఉన్నారు. కళారంగం మరింతగా స్త్రీశక్తికి పెద్దపీట వేస్తూ, ముఖ్యంగా అమ్మను ఆదిశక్తిగా, ఆరాధ్యదేవతగా కొలుస్తూ ఉంటుంది. సకల కళలకు నెలవైన సినిమా రంగం మరింతగా ‘అమ్మ’ను ఆరాధిస్తుంది. అమ్మ అనురాగం నేపథ్యంలో రూపొందిన అనేక చిత్రాలు భారతదేశంలో ఘనవిజయం సాధించాయి. నాటి ‘ఔరత్’ మొదలు నేటి ‘ఛత్రపతి’ దాకా ఎన్నో హిందీ చిత్రాలలో ‘మదర్ సెంటిమెంట్’ చోటు చేసుకొని జనాన్ని కట్టిపడేసింది. తెలుగు సినిమా రంగం సైతం తొలి నుంచీ ‘అమ్మ’ పాత్రకు విలువనిస్తూ సాగుతోంది. మన తొలి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’ (1932)లోనూ మదర్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అందులో భక్త ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడు చిత్రహింసలకు గురిచేస్తున్న సమయంలో తల్లి లీలావతి పడే మనోవేదనను చక్కగా తెరకెక్కించారు దర్శకులు హెచ్.ఎమ్.రెడ్డి. అప్పటి నుంచీ తల్లి, తనయుల అనుబంధంతో తెరకెక్కిన అనేక చిత్రాలు తెలుగువారిని విశేషంగా మురిపించాయి. ఇక మన తెలుగు చిత్రాల్లో అమ్మను కీర్తిస్తూ సాగిన గీతాలు సైతం జనం మదిలో ఈ నాటికీ మధురం పంచుతూ ఉండడం విశేషం!
తల్లి, తండ్రి, గురువు, దైవం – అంటూ క్రమం చెప్పారు. జన్మనిచ్చిన తల్లి అందరికంటే గొప్ప! ఆ తరువాత జన్మకు కారకులైన తండ్రి, ఆ పై మనలోని చీకటిని తొలగించి విజ్ఞానజ్యోతులు వెలిగించే గురువు, అటు తరువాతే కనిపించక విశ్వమంతా నిలచిన దేవుణ్ణి గురించి చెప్పారు. అందుకే మన సినిమాల్లో ‘అమ్మను దేవత’గా కొలుస్తూ పాటలు రూపొందాయి. అలాంటి వాటిలో చప్పున గుర్తుకు వచ్చేది ’20వ శతాబ్దం’లోని “అమ్మను మించి దైవమున్నదా…” అన్న పాటనే! కొందరు కవులు మరింత ముందడుగు వేసి “సృష్టి కర్త ఒక బ్రహ్మ… అతనిని సృష్టించెను ఒక అమ్మ…” (అమ్మ రాజీనామా) అన్న సత్యాన్నీ లోకానికి చాటారు. “పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా…” (నాని) అని కొందరు చెబితే, మరికొందరు “ఎవరు రాయగలరు…అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం… ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తియ్యని రాగం…” (అమ్మ రాజీనామా) అంటూ సెలవిచ్చారు. అమ్మంటే ప్రాణమిచ్చే బిడ్డలు – “వంద దేవుళ్ళే కలిసొచ్చినా… అమ్మా నీలాగా చూడలేరమ్మా…” (బిచ్చగాడు) అనీ అనగలరు.
తినగ తినగ తీపి సైతం చేదుగా మారుతుంది అంటారు. కానీ, అమ్మ అనే తియ్యనైన పదాన్ని ఎంత పలికితే అంత మధురం మన సొంతమవుతుంది. అందుకే తెలుగు సినిమాల్లో అనువైన ప్రతీచోట అమ్మ అనురాగాన్ని కీర్తిస్తూ పాటలు రూపొందాయి. అసలు స్త్రీమూర్తి మాతృత్వంలోనే తన ఆడజన్మకు సార్థకత చూస్తుందనీ కొందరు కవులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. “మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం… అమ్మా అనిపించుకొనుటే స్త్రీమూర్తికి గౌరవం…” (కులగౌరవం) అంటూ సెలవిచ్చారు. “అమ్మా అమ్మా చల్లని మా అమ్మా… త్యాగమయీ…అనురాగమయీ…” (రైతుకుటుంబం) అంటూ కొందరు పల్లవించారు. “అమ్మ అన్నది ఒక కమ్మని మాట… అది ఎన్నెన్నో తెలియని మమతల మూట…” (బుల్లెమ్మా- బుల్లోడు) అంటూ అమ్మ మమతలు అగణితం అంటూ కీర్తించారు. అందులోనే “దేవుడే లేడనే మనిషున్నాడు… అమ్మే లేదనువాడు అసలే లేడు…” అంటూ దేవునికన్నా అమ్మనే మిన్న అన్న సత్యాన్నీ చాటారు. “అమ్మ ప్రేమకు మారుపేరు… అమ్మ మనసు పూలతేరు…” (రామబాణం) అనీ ఆ తేరులో ఊరేగే తనయులనూ మన తెలుగు సినిమాలు మన ముందు ఉంచాయి. “అమ్మా అమ్మా మాయమ్మ… అమ్మంటేనే నువ్వమ్మా…” (అబ్బాయిగారు) అంటూ తల్లిలోనే దేవతను చూసుకొని పరవశించిపోయిన తనయులనూ వెండితెరపై చూడగలిగాం. మారే కాలంలో మారనిది ఏదైనా ఉందంటే అది అమ్మ అనురాగమనే అంటారు. అలాంటి వారు “నీవే నీవే నీవే నేనంటా… నీవే లేక నేనే లేనంటా…” (అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి) అంటూ తల్లిని ఆరాధించిన వైనాలూ కనిపించాయి.
“అమ్మా అని పిలచినా ఆలకించవేమమ్మా…” (పాండురంగ మహాత్మ్యం) అంటూ తనయులు తమ బాధలు తీర్చమని కన్నతల్లినే వేడుకున్న చిత్రాలు తెలుగువారికి తెలుసు! కనిపెంచిన తల్లే కాదు, కనికరం చూపిన వారినీ అమ్మలా గౌరవించే వారూ ఉన్నారు. దిక్కూ మొక్కూ లేని వారికి లోకమే ఓ అమ్మ. అందుకే “అమ్మా లాంటి చల్లనిది లోకం ఒక్కటే ఉందిలే…”(మానవుడు-దానవుడు) అంటూ లోకాన్ని నమ్ముకున్నారెందరో! ఇలా పలు రీతులుగా అమ్మను ఆరాధిస్తూ జనజీవనం సాగుతూ ఉంటుంది. అలాంటి సన్నివేశాలతో పలు తెలుగు చిత్రాలు తెరకెక్కాయి. అనువైన చోట అమ్మ ప్రేమను చాటుతూ, భావితరాలకు ‘అమ్మ’ అన్నపదంలోని తీయదనాన్ని మరింతగా అందిస్తూ రూపొందాయి. మారే కాలంలోనూ మారనిది అమ్మ ప్రేమ ఒక్కటే! కాబట్టి కంప్యూటర్ యుగంలోనూ ‘అమ్మ అనురాగం’ చాటుతూ మరెన్నో పాటలు జనాన్ని పలకరిస్తాయని ఆశించవచ్చు.