బిస్ బాస్ 4 సీజన్ లో సయ్యద్ సోహెల్ కి చాలా మంది పేరొచ్చింది. సీజన్ విన్నర్ కాకపోయినా సోహెల్ హౌజ్ లో ఉన్నంతసేపు ముక్కు సూటిగా ఉండడంతో సోహెల్ కి ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. సీజన్ అయిపోయి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన సోహెల్… బయటకి రాగానే హీరోగా మారిపోయాడు. రెండు మూడు సినిమాలు చేసాడు కానీ ఆశించిన స్థాయి హిట్ మాత్రం దక్కలేదు. దీంతో తనే సొంతగా ప్రొడక్షన్ లోకి దిగి చేసిన సినిమా ‘బూట్ కట్ బాల్రాజు’. ఇటీవలే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మోకాళ్లపై కూర్చోని సినిమాని చూడండి అని ఆడియన్స్ ని వేడుకున్న సోహెల్… తాజాగా రిలీజ్ రోజున థియేటర్స్ కి వెళ్లి… థియేటర్స్ లో ఆడియన్స్ లేకపోవడంతో ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు బానే సపోర్ట్ చేసారు కదరా ఇప్పుడు ఏమయ్యింది అంటూ మాట్లాడాడు.
“బిగ్ బాస్ సమయంలో నాకు కామెంట్స్ రాస్తూ, సపోర్ట్ చేసారు. ఇప్పుడు ఏమైంది? నా అభిమానులు నన్ను ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? మీరు నా సినిమాలు ఎందుకు చూడటం లేదు? దయచేసి నా సినిమాకి వెళ్లండి. ఈ రోజుల్లో సినిమా నిర్మాతలు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు చేయడం లేదని అంటున్నారు. ఇప్పుడు కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాతో ముందుకు వచ్చాం. బూట్‌కట్ బాలరాజును చూసిన వారు దానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి కంటెంట్ సినిమాని అందించినా జనాలు చూడడం లేదు కాబట్టి ఈసారి అడల్ట్ కంటెంట్‌తో కూడిన సినిమా చేస్తాను. ఇకపై ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు చేయను. బూట్‌కట్ బాలరాజు చాలా మంచి సినిమా. ప్రమోషన్లు చేయడానికి మా దగ్గర డబ్బు లేదు కాబట్టి అందరూ సినిమా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆక్యుపెన్సీ లేకపోవడంతో షోలు క్యాన్సిల్ అవుతున్నాయని మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మనం మంచి సినిమాలు చేస్తే ప్రజలు ప్రోత్సహించాలి” అని సోహెల్ ఎమోషనల్ అయ్యాడు. ఈ సమయంలో పక్కనే ఉన్న ముక్కు అవినాష్ సోహెల్ ని ఓదారుస్తూ ఈ వీకెండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూస్తారు నువ్వు ఫీలవ్వకు అంటూ ఓదార్చాడు.