ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ బడా మూవీ “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మొట్టమొదటిసారిగా మెగా స్టార్స్ చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే నటిస్తోందంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కాజల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి అందులో కాజల్ అగర్వాల్ మిస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఎవరూ ఆమె పేరును కూడా ఎత్తకపోవడం ఆ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. చెర్రీని ఈ విషయం అడిగితే తాను ఫైనల్ కట్ చూడలేదంటూ సమాధానాన్ని దాటవేశారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శివ కొరటాల ఈ సినిమాలో కాజల్ లేదంటూ బాంబ్ పేల్చారు.
Read Also : Pratik Gandhi : ముంబై పోలీసుల వల్ల అవమానం… నటుడి ఆవేదన
కొరటాల మాట్లాడుతూ సరైన ప్రాధాన్యత లేని పాత్రకు హీరోయిన్ ను వాడుకోవడం కరెక్ట్ కాదని తాను భావిస్తున్నట్లు వెల్లడించాడు. కథ ప్రకారం చిరు పాత్రకు ప్రేమపై ఆసక్తి లేదని ఆయన అన్నారు. కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఆమె పాత్రను చొప్పించడానికి ట్రై చేశానని, కానీ తరువాత అది కరెక్ట్ కాదని అన్పించిందని తెలిపారు. “మొదటి షెడ్యూల్ పూర్తవ్వగానే అవుట్ ఫుట్ చూశాను, సంతృప్తికరంగా అనిపించలేదు. ఇదే విషయాన్ని మెగాస్టార్‌గారితో చర్చించగా, నిర్ణయం నాకే వదిలేశారు. విషయాన్ని కాజల్‌కి వివరించగా ఆమె నవ్వుతూ స్పందించింది. కాజల్ పాత్రను ‘ఆచార్య’ నుండి పూర్తిగా తొలగించాము. రామ్ చరణ్ కు జంటగా పూజా హెగ్డే నీలాంబరి పాత్రలో నటించింది. ‘ఆచార్య’లో చిరంజీవి గారికి లీడింగ్ లేడీ లేదు” అని కొరటాల శివ అన్నారు. కాగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మెగా చిత్రంలో పూజా హెగ్డే, తనికెళ్ల భరణి, సోనూసూద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.