సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆయన పిల్లలు గౌతమ్, సితారలకు కూడా అప్పుడే స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఈ స్టార్ కిడ్స్ సినిమా ఎంట్రీ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ‘1 నేనొక్కడినే’ చిత్రంలో చిన్న పాత్రలో నటించగా, అతని కుమార్తె సితార తెలుగులో ‘ఫ్రోజెన్’ కోసం డబ్బింగ్ చెప్పింది. సితారకు సినిమాలు చేసే ఆసక్తి ఉందా ? అని తాజాగా మహేష్ ను అడిగినప్పుడు “ఆమెకు తెలుగు సినిమాలు చేయడం ఇష్టం లేదు. ఆమెకు ఇంగ్లీష్ సినిమాలు చేయాలని ఉంది. ఆమె తెలుగులో ఫ్రోజెన్ కు డబ్బింగ్ చెప్పింది. వారు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అనే విషయాన్నే వాళ్ళకే వదిలిపెట్టాము. నిజాయితీగా చెప్పాలంటే నా కుమార్తెతో నటించడానికి నేను నిజంగా భయపడ్డాను” అని మహేష్ చెప్పుకొచ్చారు.
Read Also : మరోసారి చిరు సరసన తమన్నా
ఇక మహేష్ బాబు విషయానికొస్తే ప్రస్తుతం ఆయన పెద్ద సంఖ్యలో బ్రాండ్లను ఆమోదిస్తున్నారు. కొత్తగా బిగ్ సి బ్రాండ్ కు కూడా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆయన నటిస్తున్న “సర్కారు వారి పాట” షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయిందని, ఈ సంవత్సరం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నామని మహేష్ బాబు తెలియజేశారు. రాజమౌళి ప్రాజెక్ట్ గురించి కూడా ఎగ్జైటెడ్ గా ఉన్నట్లు మహేష్ వెల్లడించారు.