SP Sailaja Birthday Special: ఒక కొమ్మకు పూచిన పూలు దాదాపు ఒకేలా ఉన్నట్టే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి సంతానంలో ఆయనలాగే ఇద్దరికి గానం ప్రాణమయింది. వారే ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆయన చెల్లెలు ఎస్.పి.శైలజ. తండ్రి సాంబమూర్తి హరికథ చెప్పడంలో మేటి అనిపించుకుంటే, ఆయన పిల్లలు చిత్రసీమలో తమ గాత్రంతో జైత్రయాత్ర చేశారు. బాలు చెల్లెలు అన్న గుర్తింపుతోనే సినిమా రంగంలో అడుగు పెట్టినా, తన గళ విన్యాసాలతో శైలజ సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు. గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా, టీవీ షోస్ లో న్యాయనిర్ణేతగా, నటిగా శైలజ బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు.
శైలజ 1962 అక్టోబర్ 9న నెల్లూరులో జన్మించారు. ఎస్పీ సాంబమూర్తి 8 మంది సంతానంలో అందరికంటే చిన్నవారు శైలజ. బాలు గాయకునిగా పేరు సంపాదించడంతో వారి కుటుంబంలోని కొందరు ఆయన నీడన చేరారు. అలా శైలజ కూడా అన్న దగ్గర చేరుకున్నారు. ఈ కుటుంబానికి ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ బంధువు. దాంతో శైలజలోని గాత్రాన్ని పసికట్టి ఆయన ముందుగా ఆమెను డబ్బింగ్ కళాకారిణిగా పరిచయం చేశారు. విశ్వనాథ్ తెరకెక్కించిన ‘సీతామాలక్ష్మి’లో నాయిక తాళ్లూరి రామేశ్వరికి తొలిసారి డబ్బింగ్ చెప్పారు శైలజ. ఆ తరువాత నటిగానూ విశ్వనాథ్ ‘సాగరసంగమం’లో పరిచయం చేశారు. అప్పటికే నృత్యంలో శిక్షణ పొందడంతో ఆ సినిమాలో అతి సులువుగా తన పాత్రలో ఒదిగిపోయారు శైలజ. ఆ చిత్ర ఘనవిజయం తరువాత శైలజకు నటిగా అనేక అవకాశాలు పలకరించాయి. అయితే ఆమె అభినయానికి దూరంగానే జరిగారు. మాదాల రంగారావు నిర్మించి, నటించిన ‘ఎర్రమల్లెలు’లో ఆయన తనయుడు మాస్టర్ రవికి “నాంపల్లి స్టేషన్ కాడి…రాజాలింగో…” పాట పాడి యావత్ తెలుగునేలనూ పులకింప చేశారు శైలజ. అప్పటి నుంచీ శైలజ గళంలో జాలువారిన అనేక పాటలు జనాన్ని అలరిస్తూనే ఉన్నాయి.
శైలజ నోట పలికిన పాటలే కాదు ఆమె నోటి మాటలు సైతం అనేకమంది తారల నటనకు ప్రాణం పోశాయి. శ్రీదేవి ఇతర భాషల్లో నటించిన చిత్రాలు తెలుగులో అనువాదమైనప్పుడు ఆమె పాత్రకు శైలజ చెప్పిన డబ్బింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. అచ్చు శ్రీదేవిలాగే తన గళాన్ని సవరించుకొని గమ్మత్తు చేశారు శైలజ. ఇక రాధిక, టబు, హీరా, శరణ్య, సాక్షి శివానంద్, సోనాలీ బింద్రే, రవీనా టాండన్ వంటి అనేకమంది పరభాషా నాయికలు తెలుగులో శైలజ మాటతోనే సాగారు. “సరిగమలు, సూపర్ సింగర్, సరిగమప” వంటి కార్యక్రమాల్లో శైలజ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాటకు, మాటకు న్యాయంచేస్తూనే సాగుతున్నారు శైలజ.
నటుడు శుభలేఖ సుధాకర్‌ను వివాహమాడిన శైలజకు ఓ బాబు. పేరు శ్రీకర్. సుధాకర్, శైలజ సంసార నౌక హాయిగా సాగుతోంది. శైలజ మరిన్ని వసంతాలు చూస్తూ మరింతగా జనాన్ని ఆకట్టుకుంటారని ఆశిద్దాం.
(అక్టోబర్ 9న ఎస్పీ శైలజ పుట్టినరోజు)