2017 లో ‘మహానుభావుడు’ సినిమాతో దర్శకుడు మారుతి యువ హీరో శర్వానంద్ ను వినూత్నంగా చూపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శర్వా ఓసీడీ (ఓవర్ క్లీనింగ్ డిజార్డర్) తో బాధపడుతున్నట్లు చూపిస్తారు. కమర్షియల్ గా అనుకున్న మేర వసూళ్లను సాధించలేకపోయింది ఈ సినిమా. కాగా మారుతి కథలో శర్వా పాటించిన పద్ధతులనే కరోనా టైమ్ లో అందరూ పాటించక తప్పడం లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నమస్కారం చేయాలి, చేతులు కడుక్కోవాలి, సామాజిక దూరం పాటించాలి అని ప్రస్తుతం మనం చెప్పుకొంటున్న నియమాలను అప్పట్లో ‘మహానుభావుడు’ చిత్రంలోని శర్వానంద్ పాత్ర ద్వారా దర్శకుడు మారుతి చూపించారు. ఇదిలావుంటే, తాజా సమాచారం మేరకు.. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథలపై చాలావరకూ కసరత్తులు పూర్తయ్యాయని.. శర్వానంద్ కూడా ఒకే చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ షూటింగ్ పూర్తికానుందని తెలుస్తోంది. మరోవైపు శర్వానంద్ ‘మహాసముద్రం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.