Sharwanand Talks About Padi Padi Leche Manasu Movie Result: మనం ప్రాణం పెట్టి చేసే పనిలో సరైన ఫలితం దక్కకపోతే ఎంత బాధగా ఉంటుంది? ఓ సినిమా ఫ్లాప్ అవ్వడంతో, తానూ అంతే బాధను అనుభవించానని ఆవేదన చెందాడు హీరో శర్వానంద్. ఆ సినిమాని తాను ఎంతో నమ్మి చేశానని, చాలా రోజుల పాటు కష్టపడ్డానని అన్నాడు. మనసు పెట్టిన చేసిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని, దాంతో తాను మూడు నెలలు బయటకు రాలేదని చెప్పాడు. ఇంతకీ, ఆ సినిమా ఏదని అనుకుంటున్నారా? మరేదో కాదు.. ‘పడి పడి లేచే మనసు’.
తన తాజా చిత్రం ఒకే ఒక జీవితం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా.. శర్వానంద్ లేటెస్ట్‌గా దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగానే ‘పడి పడి లేచే మనసు’ సినిమా ఫలితంపై స్పందించాడు. ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని తానెంతో నమ్మానని, 130 రోజుల పాటు కష్టపడ్డానని పేర్కొన్నాడు. కానీ, అది ఫ్లాప్ అయ్యా చాలా బాధగా అనిపించిందని చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా విజయాన్ని అందుకోలేదని, దాంతో తాను విశ్లేషణ చేసుకోవడం మొదలుపెట్టానని తెలిపాడు. హడావుడిగా సినిమాలు చేయడం వల్ల ఏం లాభం ఉండదని తెలుసుకున్నానని, అందుకే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌కి సంతకం చేయడానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడించాడు.
ఇదే సమయంలో.. ‘కో అంటే కోటి’ సినిమా సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా శర్వా చెప్పుకొచ్చాడు. గమ్యం, ప్రస్థానం వచ్చిన నాలుగేళ్ల తర్వాత తాను ఆ సినిమా చేశానని.. ఆ టైంలో ఎదురైన ఓ సంఘటన తననెంతో బాధించిందని పేర్కొన్నాడు. ఆ సినిమాకి తానూ ఓ నిర్మాతనని, ఆ చిత్రం పోవడంతో డబ్బులు పోయాయని అన్నాడు. డబ్బుల కారణంగా చాలామంది స్నేహితులు, చుట్టాలతో సంబంధాలు తెగిపోయాయన్నాడు. ఆ విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోయానన్నాడు. అప్పులు తీర్చేందుకు తనకు ఆరేళ్ల సమయం పట్టిందని, ఆ ఆరేళ్ల కాలంలో తాను ఒక్క చొక్కా కూడా కొనలేదని శర్వా ఆనాటి బాధల్ని పంచుకున్నాడు.