Shahrukh Khan: ఎంతటి వీరుడైనా, ఎన్ని ఘనవిజయాలు సాధించినా ఏదో ఒక అసంతృప్తి వెన్నాడుతూనే ఉంటుందని అంటారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ను చూస్తే అది నిజమే అనిపించక మానదు. ఒకప్పుడు వరుస విజయాలు చూసిన షారుఖ్ ఖాన్, కొన్నేళ్ళుగా వరుస పరాజయాలు చూస్తున్నారు. దాంతో మళ్ళీ ఓ బంపర్ హిట్ కొట్టి చూపించాలని ఆయన తపిస్తున్నారు. నిజానికి షారుఖ్ చూడని విజయాలు లేవు, ఎక్కని ఎత్తులూ లేవు. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ఒక కేంద్రంలో ప్రదర్శితమైన చిత్రంగా ఆయన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ నిలచింది. అంతకు ముందు, ఆ తరువాత కూడా షారుఖ్ అపూర్వ విజయాలనే చవిచూశారు. కానీ, ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ తరువాత ఆయనకు మళ్ళీ ఆ స్థాయి విజయం లభించలేదు. ఆ తరువాత వచ్చిన చిత్రాలలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ విజయం సాధించినా, మునుపటి స్థాయిలో రన్ సాగలేదు. ఆపై కేమియో అప్పియరెన్స్ ఇచ్చిన సినిమాలూ అంతంత మాత్రమే అనిపించాయి. షారుఖ్ హీరోగా రూపొందిన ‘పఠాన్’ సినిమా సాంగ్ డిసెంబర్ 12న జనం ముందు నిలచింది. అలా వచ్చిందో లేదో ఇలా దూసుకుపోతోంది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధిస్తోంది. అంతా బాగానే ఉంది. కానీ, వ్యూస్ అన్ని సాధించడం అంతా దీపికా పదుకొనె ప్రభావమే తప్ప షారుఖ్ బట్టలూడదీసుకుంటే వచ్చింది కాదని ట్రోల్ సాగుతోంది.
ఇంతకూ కింగ్ ఖాన్ పై ఇంతటి విమర్శలు ఎందుకో? నిజానికి చాలా రోజుల నుంచీ బాలీవుడ్ పై కొందరు నజర్ పెట్టి ‘బాయ్ కాట్’ అనే స్లోగన్ తీసుకు వచ్చారు. వారిలో ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్లు ఉన్నారు. అలాగే చిత్రసీమకు చెందిన వారి వారసులూ చోటు సంపాదించారు. బాయ్ కాట్ దెబ్బ షారుఖ్ ‘పఠాన్’పైనా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే, ఆ సినిమా టైటిలే ఓ వర్గానికి చెందినట్టుగా ఉందని కొందరి వాదన! తప్పకుండా ఆ సినిమాకు ‘బాయ్ కాట్ బ్యాచ్’ ట్రోల్స్ దెబ్బ ఉంటుందని అందరూ భావించారు. కానీ, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ నుండి “బేషరమ్ రంగ్..” సాంగ్ అలా రాగానే జనం విరగబడి చూస్తున్నారు. అంటే ‘బాయ్ కాట్’ దెబ్బ లేనట్టే కదా అన్నది షారుఖ్ సపోర్టర్స్ వాదన. అయితే ఇక్కడే ఉంది విమర్శకుల అసలు మాట! అదేమిటంటే, ఒకప్పుడు కింగ్ లా వెలిగిన షారుఖ్ తన చిత్ర విజయం కోసం దీపికా పదుకొణే లోని అంగాంగాన్నీ చూపించాల్సి వచ్చిందని అంటున్నారు. ఇంతకంటే, హీనం మరోటి ఏముందనీ వారి ప్రశ్న!
ఇంకో మాట చెప్పాలంటే షారుఖ్ ఖాన్ చివరి విజయం ‘చెన్నై ఎక్స్ ప్రెస్’లోనూ, ఆ తరువాత హిట్ అనిపించుకున్న ‘హ్యాపీ న్యూ ఇయర్’లోనూ దీపికా పదుకొణేయే నాయిక. తాజాగా ‘పఠాన్’లోనూ దీపికానే హీరోయిన్. ఆమె అందంతోనే పాట బంధాలు వేస్తోందనీ విమర్శకుల మాట. అంతేకాదు, షారుఖ్ మరో కొత్త సినిమా ‘జవాన్’లో ప్రధాన నాయిక నయనతార అయినా, అందులోనూ దీపిక కేమియో అప్పియరెన్స్ ఇస్తోంది. దీనిని బట్టే షారుఖ్ ఏ మేరకు ఇబ్బంది పడుతున్నాడో అర్థమవుతోందని ఎద్దేవా చేస్తున్నారు. పైగా ‘పఠాన్’లోని తాజా పాటలో షారుఖ్ ఖాన్ తన కండల బాడీ ఎంత చూపించినా, జనం మాత్రం దీపికా ఊపులకే కళ్ళు వాచేలా చూస్తున్నారనీ విమర్శకులు అంటున్నారు. అసలు ఈ రికార్డ్ స్థాయి వ్యూస్ వెనకా షారుఖ్ కాసులు ఖర్చు పెట్టి ఉంటాడనీ అనుమానిస్తున్నారు. తన ‘పఠాన్’ను హిట్ చేసుకోవడానికి షారుఖ్ పడరాని పాట్లు పడుతున్నారనీ ఆయన విమర్శకులు భావిస్తున్నారు. మరి రాబోయే జనవరి 25న జనం ముందుకు వస్తున్న ‘పఠాన్’ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.