AHA: అగ్ర నిర్మాణ సంస్థలు సైతం డిజిటిల్ ప్లాట్ ఫామ్ కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వెండితెరపై ప్రదర్శించే భారీ చిత్రాలను ఓ వైపు నిర్మిస్తూనే, ఓటీటీ చిత్రాలు, వెబ్ సీరిస్ లపై దృష్టి పెడుతున్నాయి. దాంతో కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ను తెరకెక్కించే దర్శకులకు మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతోంది. గత యేడాది ఆగస్ట్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అభినవ దండా దర్శకత్వంలో ‘సత్తిగాని రెండు ఎకరాలు’ అనే మూవీని ఓటీటీ కోసమే ప్రారంభించింది. ఇప్పుడా సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఇదే నెల 17న దీనిని ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నుండే ‘పుష్ప’ సినిమా విడుదలై, ఘన విజయం సాధించింది. అందులో హీరో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన జగదీశ్ ప్రతాప్ బండారికి, అలానే సునీల్ బావమరిదిగా నటించిన రాజ్ తిరందాసుకు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడీ ‘సత్తిగాని రెండు ఎకరాలు’ చిత్రంలో వీరిద్దరే కీలక పాత్రలు పోషించడం విశేషం. అలానే ‘వెన్నెల’ కిశోర్, బిత్తిరి సత్తి, అనీషా దామా, మోహనశ్రీ, కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కొల్లూరు నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సత్తిగాడికి ఉన్నవే రెండు ఎకరాలు.. అమ్మకపోతే గడవదు, అమ్మితే మింగుడుపడదు’ అనే అంశం ప్రధానంగా ఈ సినిమా సాగబోతోంది. మరి తొలిసారి ఓటీటీ మూవీని తీసిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ కంటెంట్ ఓరియంటెడ్ మూవీతో ఏ మేర వ్యూవర్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి.