భానుప్రియ అన్న నాలుగక్షరాలు ఆ రోజుల్లో ఎందరో కుర్రాళ్ళకు నిత్యం జపించే మంత్రం. భానుప్రియ అందాల అభినయం రసిక హృదయాల్లో ఓ ఆకర్షణ యంత్రం. కనులు మూసినా, తెరచినా ఈ విశాలాక్షి రూపాన్నే స్మరిస్తూ సాగినవారెందరో. అందరికీ ఈ నాటికీ భానుప్రియ పేరు వినగానే మదిలో మధురమైన బాధ మొదలు కాక మానదు. నటనతోనూ, నర్తనంతోనూ తెలుగువారికి నయనానందం కలిగించిన అభినయ ప్రియ ఆమె.
భానుప్రియ అసలు పేరు మంగభాను. స్వస్థలం రాజమండ్రి సమీపంలోని రంగంపేట. అక్కడే భానుప్రియ 1967 జనవరి 15న కన్నుతెరచింది. భానుప్రియకు కన్నెవయసు రాకముందే ఆమె కన్నవారు చెన్నపట్టణం చేరారు. అక్కడే భానుప్రియలోని అభినయంపై అభిలాష చలనచిత్రాలవైపు పరుగు తీసింది. భారతీ-వాసు తెరకెక్కించిన ‘మెల్ల పేసుంగల్’లో తొలిసారి తెరపై తళుక్కుమంది భాను అందం… ఈ నల్లపొన్ను తమిళ జనాన్ని కట్టిపడేసింది…
ప్రతిభ ఉన్నవారందరూ ప్రకాశించలేరు. అదృష్టం ఉన్నవారి చెంతకే ప్రతిభావంతులూ చేరతారు. ప్రతిభకు పట్టం కడతారు. అప్పటికే ‘మంచుపల్లకి’ తీసి, ‘సితార’ రూపకల్పనలో ఉన్నారు దర్శకుడు వంశీ. భానుప్రియలోని నాట్యం ఆయనను ఆకర్షించింది. తన ‘సితార’కు కావలసిన తారను ఆయన భానుప్రియలో చూసుకున్నారు. తొలి చిత్రం ‘సితార’తోనే ప్రేక్షకుల మనసులు గెలచుకుంది భానుప్రియ. వంశీ చిత్రాల్లో భానుప్రియకు అందం, అభినయం రెండింటికి ప్రాధాన్యమున్న పాత్రలు లభించాయి. ఆ పాత్రలతో జనానికి మరింత చేరువయ్యారామె.
నాటి టాప్ స్టార్స్ అందరి సరసన భానుప్రియ అందం చిందేసింది. ఏ హీరోతో జోడీ కట్టినా భానుప్రియ తన డాన్స్ తో మత్తెక్కించింది. ఆ మత్తునే జనం కోరుకున్నారు. చిత్తవుతూనే మళ్ళీ మళ్ళీ భాను డాన్స్ చూసి తామూ చిందేశారు. భానుప్రియకు ఆమె కళ్ళు ఎంత పెద్ద ఆకర్షణో, నాట్యం అంతకంటే మిన్న అని చెప్పవచ్చు. కళాతపస్వి కె.విశ్వనాథ్ ఆమె నాట్యం చుట్టూ కథను అల్లుతూ ‘స్వర్ణకమలం’ రూపొందించారు. దీనిని బట్టే భానుప్రియ నర్తనానికి ఎంతటి కీర్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘స్వర్ణకమలం’ అప్పట్లో ఎందుకనో అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఇప్పటికీ ఆ సినిమా వస్తోందంటే చాలు నవతరం ప్రేక్షకులు సైతం కళ్ళప్పగించి చూస్తున్నారు. ఫలితం ఎలా ఉన్నా భానుప్రియ అభినయానికి అసలైన అవార్డు ‘స్వర్ణకమలం’ అని చెప్పవచ్చు.
భానుప్రియ అనేక హిందీ చిత్రాలలో నాటి మేటి హిందీ నటుల సరసన నటించి ఆకట్టుకున్నారు. సదరు చిత్రాలతో కొంత గుర్తింపు లభించగానే మన తెలుగు తార శ్రీదేవిలాగా ముక్కును సన్నం చేసుకుంది. కానీ, అది భానుప్రియకు కలసి రాలేదు. కలిసొచ్చిన కాలంలో భానుప్రియ నటించిన తెలుగు చిత్రాలు కనకవర్షం కురిపించాయి. తరువాత బాలీవుడ్ పై భానుప్రియ ఫోకస్ ఎక్కువయింది. ఇక్కడ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో తమిళ, హిందీ చిత్రాలతోనే భానుప్రియ కొంతకాలం సాగారు. ఆ పై అమెరికా వెళ్ళి అక్కడే పెళ్ళి చేసుకున్నారు. కొంతకాలం భాను కాపురం సవ్యంగా సాగింది. ఆ తరువాత విడాకులు తీసుకొని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి తన వయసుకు తగ్గ పాత్రలు ధరించారు. ఆ చిత్రాలతోనూ అలరించారు. ‘ఛత్రపతి’లో ప్రభాస్ తల్లిగా భానుప్రియ మళ్ళీ జనాదరణ చూరగొన్నారు. ఇప్పుడంటే భానుప్రియ వయసుకు తగ్గ పాత్రల్లో కనిపిస్తున్నారు. కానీ, ఆ నాటి ఆమె విశాల నేత్రాలను జనం ఎప్పటికీ మరచిపోలేరు