యమలీల చిత్రంలో నీ జీను ప్యాంటు వేసి బుల్లెమ్మో.. అంటూ టైట్ జీన్స్ లో కుర్రకారును హోరెత్తించిన అందం ఇంద్రజ. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని తెలుగు, తమిళ్, కన్నడ అని లేకుండా అన్ని భాషల్లోనూ హిట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ఒక వ్యాపారవేత్తను పెళ్ళాడి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇంద్రజ రీ ఎంట్రీ ఇచ్చి బిజీగా మారిపోయింది. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా నటిస్తూనే మరోపక్క బుల్లితెర షో లకు జడ్జిగా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక ఇటీవల ఇంద్రజ నటించిన స్టాండ్ అప్ రాహుల్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ ప్రమోషన్లలో పాల్గొన్న ఇంద్రజ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
” పెళ్లి తరువాత ఇలాంటి అవకాశాలు రావడం చాలా ఆనందంగా ఉంది. నటిగా నా ప్రయాణం ఎప్పటికి ముగిసిపోనిది.. నేను నటిగా నేర్చుకున్నది చాలా తక్కువ .. ఇంకా నేర్చుకొంటూనే ఉంటాను. ఇక ప్రస్తుత సినిమాలలో మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు అరుదుగా వస్తున్నాయి.. అది మారితే బావుంటుంది. నా దృష్టిలో నటనకు పరిమితులు ఉండవు.. పెళ్లైన మగాడు.. పెళ్లి తరువాత కుల హీరోగా చేస్తాడు.. కానీ పెళ్లి అయిన హీరోయిన్ మాత్రం పెళ్లి తరువాత తల్లిగా, అక్కగా కొనసాగుతుంది. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే పెళ్లి తరువాత సమాజం ఆమెను ఒక తల్లిగా, భార్యగా గౌరవిస్తుంది.. ఆమెకు తగ్గ పాత్రలను ఇచ్చి ప్రోత్సహిస్తుంది. నేను నాకు పాప పుట్టాకా న నాలుగేళ్లు తన ఆలనా పాలనా చేసుకోవడానికే సరిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాను. ప్రస్తుతం నాలుగు సినిమాలలో నటిస్తున్నాను.” అంటూ చెప్పుకొచ్చింది.