శుక్రవారం సాయంత్రం నుండి ‘సీటీమార్’ మూవీ సెప్టెంబర్ 3 న విడుదల కాదని, వాయిదా పడుతుందని ప్రచారం సాగుతోంది. దానిని కన్ ఫామ్ చేస్తూ చిత్ర నిర్మాతలు తాజాగా సెప్టెంబర్ 10న తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నయా పోస్టర్ ను రిలీజ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూత పడిన థియేటర్లు పూర్తి స్థాయిలో తెరచుకోక పోవడం, ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు రన్ కావడంతో పాటు… ఇటీవల బాగున్నాయనే ప్రచారం జరిగిన సినిమాలకు సైతం థియేటర్లలో జనం కనిపించకపోవడంతో ‘సీటీమార్’ నిర్మాత ఓ వారం ఆగి తమ చిత్రాన్ని విడుదల చేద్దామని భావించినట్టు తెలుస్తోంది.
కబడ్డీ నేపథ్యంలో భారీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘సీటీమార్’తో హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది రెండోసారి జత కట్టారు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని, రావు రమేష్, రెహమాన్, బాలీవుడ్ యాక్టర్ తరుణ్ అరోరా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. పెప్పీ ఆంటీ ఐటమ్ సాంగ్ లో అప్సర రాణి నటించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ఈ మూవీని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్ళాయని నిర్మాత శ్రీనివాస చిట్టూరి చెబుతున్నారు. ఏదేమైనా గోపీచంద్ అభిమానులు మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు!
