వెర్సటైల్ హీరో సత్యదేవ్ నటించిన ‘గాడ్సే’ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. జూన్ 17వ తేదీ ఆ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సి. కళ్యాణ్ ప్రకటించారు. ఐశ్వర్యలక్ష్మీ నాయికగా నటించిన ‘గాడ్సే’లో నాజర్, షాయాజీ షిండే, కిశోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతంలో సత్యదేవ్ తో ‘బ్లఫ్ మాస్టర్’ మూవీని తెరకెక్కించిన గోపీ గణేశ్ ఇప్పుడీ ‘గాడ్సే’ను డైరెక్ట్ చేశాడు. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడితో పోరాడే యువకుడి పాత్రలో సత్యదేవ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అలానే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఐశ్వర్య లక్ష్మి నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు గోపీ గణేశే కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చడం విశేషం.
ఇదిలా ఉంటే… జూన్ 17వ తేదీన తమ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు చాలా ముందుగానే ఈ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు. రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ద్వారా శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో తొట్టెంపూడి వేణు ఓ కీలక పాత్రను పోషించాడు. ప్రస్తుత సమాజంలోని అసాంఘీక ఘటనలను వేలెత్తి చూపుతున్న ఈ రెండు సినిమాలలో దేని వైపు ప్రేక్షకులు మొగ్గుచూపుతారో వేచి చూడాలి.