ఓ సినిమా ఆఫర్ వచ్చిందంటే.. నటీనటులు గుడ్డిగా ఒప్పేసుకోరు. కథ, ముఖ్యంగా తాము పోషించబోయే పాత్ర బాగుందా? లేదా? అనేది విశ్లేషించుకుంటున్నారు. సీనియర్లైతే కచ్ఛితంగా తమ రోల్ ప్రభావవంతంగా ఉంటుందా? లేదా? అనేది బేరీజు వేసుకుంటారు. ఆ తర్వాతే సినిమాకి పచ్చజెండా ఊపాలా? వద్దా? అన్నది డిసైడ్ అవుతారు. ఒకవేళ నచ్చకపోతే, నిర్మొహమాటంగా సినిమాని రిజెక్ట్ చేస్తారు. కానీ, తాను మాత్రం తన పాత్ర నచ్చకపోయినా సినిమా చేశానని సత్యరాజ్ బాంబ్ పేల్చాడు. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’.
2013 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో సత్యరాజ్, దీపికా తండ్రిగా నటించాడు. ఇది బాలీవుడ్ చిత్రమైనప్పటికీ, చెన్నై నేపథ్యంలో కథ సాగుతుంది. అందుకే, నేటివిటీ కోసం సత్యరాజ్‌ను ఎంపిక చేసుకున్నారు. సినిమాలో ఈ పాత్ర ప్రభావవంతంగానే ఉంటుంది కానీ, తనకు మాత్రం నచ్చలేదని సత్యరాజ్ వెల్లడించాడు. ‘‘చెన్నై ఎక్స్ ప్రెస్‌లో నేను హీరోయిన్ తండ్రి పాత్రను పోషించాను. ఆ పాత్ర గురించి నాకు చెప్పినప్పుడు, అంత గొప్పగా అనిపించలేదు. ఆ పాత్ర నాకు నచ్చలేదనే విషయాన్ని షారుఖ్, దర్శకుడు రోహిత్‌తోను చెప్పాను. అయినా ఆ సినిమాలో నటించాను. అందుకు కారణం.. షారుఖ్. ఆయనంటే నాకెంతో ఇష్టం. ఆయన మీదున్న అభిమానంతోనే సినిమా చేశాను’’ అని సత్యరాజ్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
సాధారణంగా.. ఏదైనా సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఫలానా పాత్ర నచ్చలేదని నటీనటులు చెప్తుంటారు. కానీ.. సినిమా మంచి విజయం సాధించినా, ఆ పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెట్టినా తనకు నచ్చలేదని సత్యరాజ్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. జగపతి బాబు సైతం లెజెండ్‌లో తాను పోషించిన విలన్ పాత్ర పట్ల అసంతృప్తిని వెళ్లగక్కిన విషయం తెలిసిందే! తనతో వీరోచితమైన పాత్ర అయినప్పటికీ, దర్శకుడు చాలా వీక్‌గా చూపించడం నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో ఆయన కుండబద్దలు కొట్టాడు.