గడిచిన నాలుగు నెలలతో పోల్చితే మే లో తక్కువ సినిమాలు విడుదలయ్యాయి. స్ట్రయిట్, డబ్బింగ్, ఓటీటీ సినిమాలతో కలిపి కేవలం 17 చిత్రాలే జనం ముందుకు వచ్చాయి. విశేషం ఏమంటే పలు చిన్న సినిమాల నడుమ ‘సర్కారు వారి పాట’, ‘ఎఫ్ 3′ రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక వీక్ వైజ్ గా చూసుకుంటే మే 6వ తేదీ ఏకంగా ఏడు సినిమాలు ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో సందడి చేశాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత సుమ కీలక పాత్ర పోషించిన’జయమ్మ పంచాయితీ’ మే 6న విడుదలైంది. భిన్నమైన కథను దర్శకుడు ఎంపిక చేసుకున్నాడనే ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా జయమ్మ విజయం సాధించలేకపోయింది. అదే అనుభవం విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’కూ లభించింది. అతని గత చిత్రం ‘పాగల్’తో పోల్చితే ఇది బెటర్ మూవీ అన్నారు. కానీ వినోదాన్ని పంచడంలో విశ్వక్ సేన్ ఫెయిల్ అయ్యాడు. వైవిధ్యమైన కథతో జనం ముందుకు వచ్చే శ్రీవిష్ణు సైతం ‘భళా తందనాన’తో మెప్పించలేకపోయాడు. ఈ వారం విడుదలైన వాటిలో ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ మల్టీపేర్స్ ఆఫ్ మ్యాడ్నెస్’ ఫర్వాలేదనిపించింది. ఇక ఓటీటీలో వచ్చిన ‘దొంగాట, చిన్ని, ద కశ్మీర్ ఫైల్స్’ పెద్దంత మెప్పించలేదు. అవార్డ్ విన్నింగ్ మూవీ ‘దొంగాట’ విమర్శకులకు నచ్చింది. ‘చిన్ని’ చిత్రంలో కీర్తి సురేశ్ నటన ప్రశంసించదగ్గదిగా ఉంది. ఇక థియేటర్లలో వేవ్స్ సృష్టించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది.
మే నెల సెకండ్ వీకెండ్ లో 12వ తేదీ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ విడుదల కాగా, ఆ మర్నాడు శివ కార్తికేయన్ ‘డాన్’ రిలీజైంది. మహేశ్, కీర్తి సురేశ్ జంటగా వచ్చిన ‘సర్కారు వారి పాట’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ స్థాయిలో సినిమా లేదన్నది విమర్శకుల మాట. అయినా తమ సినిమాకు వరల్డ్ వైడ్ రూ. 200 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించటం విశేషం. ఈ యేడాది విడుదలైన తెలుగు చిత్రాలలో కలెక్షన్ల పరంగా తమదే అగ్రస్థానంగా డిక్లేర్ చేసింది సర్కారు యూనిట్. ఇక ‘డాన్’ గా వచ్సిన శివకార్తికేయన్ ఓ వర్గం ప్రేక్షకులనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వారం రాజశేఖర్ ‘శేఖర్’, బండ్ల గణేశ్ ‘డేగల బాబ్జీ’, సంపూర్ణేశ్ బాబు ‘థగడ్ సాంబ’, ‘ధ్వని’, అనువాద చిత్రం ‘ది మిస్టరీ ఆఫ్ ది డ్రాగన్ సీల్’ విడుదలయ్యాయి. ఇందులో ‘శేఖర్’ మలయాళ రీమేక్ కాగా, ‘డేగల బాబ్జీ’ తమిళ రీమేక్. వీటితో పాటు ఏ సినిమాకూడా ప్రజాదరణ పొందలేదు.
ఇక మే నాలుగోవారంలో జనం ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఎఫ్ 3’ వచ్చింది. వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబోలో గతంలో విడుదలై విజయం సాధించిన ‘ఎఫ్ 2’ తర్వాత అదే ఫ్రాంచైజ్ లో వచ్చిన చిత్రం కావడంతో దీనిపైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఫన్ కంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అని వినిపిస్తున్నా చిత్ర బృందం థియేటర్ల చుట్టేస్తూ సక్సెస్ కోసం తాపత్రయపడుతోంది. మే 27న విడుదలైన ‘టాప్ గన్ మేవరిక్’ కు బాగా ఉందనే టాక్ వచ్చినా కలెకన్లు నిల్. ఇక 28న విడుదలై ఆది సాయికుమార్ ‘బ్లాక్’ చూసిన వారైతే మైండ్ బ్లాంక్ అయిపోయిందని వాపోతున్నారు. ఈ వారంతంలో ఆహాలో స్ట్రీమింగ్ అయిన తమిళ అనువాద చిత్రం ‘రైటర్’కూ పెద్దంత గుర్తింపు రాలేదు. మొత్తం మీద వసూళ్ళ విషయంలో క్లారిటీ లేకున్నా… మే నెల మాత్రం ‘సర్కారు వారి’దే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు!