ఉపేంద్ర హీరోగా నటించిన ‘ఐ లవ్ యూ’ మూవీ 2019లో విడుదలైంది. దీనిని తెలుగులోనూ డబ్ చేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న నాలుగైదు కన్నడ చిత్రాలు సెట్స్ మీద వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, ప్రముఖ నటి వేదికతో కలిసి ఉపేంద్ర నటించిన ‘హోమ్ మినిస్టర్’ మూవీ ఏప్రిల్ 1న జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే ఆ తర్వాత వారమే ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన ‘గని’ చిత్రం సైతం కన్నడలో డబ్ అయ్యి ఏప్రిల్ 8న విడుదల అవుతోంది. ఆ రకంగా ఉపేంద్ర సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ విడుదల అవుతున్నట్టే.
Read Also : KGFVerse : రాఖీభాయ్ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి రెడీనా ?
2005లో తెలుగులో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఉపేంద్ర నటించాడు. అందులోని పాత్ర ఉపేంద్రలోని నటుడిని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగు చిత్రాలలో పలు అవకాశాలు వచ్చినా, ఉపేంద్ర పెద్దంత ఆసక్తి చూపలేదు. అయితే అల్లు అరవింద్ తనయుడు బాబీ తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న ‘గని’ సినిమాలోని పాత్ర నచ్చడంతో ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఉపేంద్ర పోషించిన పాత్రకున్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ చిత్రాన్ని కన్నడలోకి డబ్ చేసి ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నామని బాబీ చెప్పడం విశేషం.
ఇక ‘హోమ్ మినిస్టర్’ మూవీ విషయానికి వస్తే సుజయ్ కె. శ్రీహరి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు జిబ్రాన్ శాండిల్ వుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ‘హోమ్ మినిస్టర్’ అనే టైటిల్ బట్టీ ఇదేదో పొలికల్ మూవీగా జనం భావించే ఆస్కారం ఉందని, కానీ దాన్ని మించిన ఫ్యామిలీ డ్రామా ఇందులో ఉంద’ని ఉపేంద్ర చెబుతున్నాడు. తన్యా హోప్, సుమన్ రంగనాథన్, అభిమన్యు సింగ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.