Salman Khan Revealed Why He Accepted Godfather Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్ర పోషించిన విషయం తెలిసిందే! ఈ పాత్ర ఒప్పుకోవడానికి గల కారణాలేంటో.. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో సల్మాన్ చెప్పుకొచ్చాడు. సినిమాల పట్ల చిరంజీవికి ఉన్న ప్రేమ, తమ మధ్య ఉన్న అనుబంధం వల్లే.. తాను ఇందులో నటించేందుకు ఒప్పుకున్నానన్నాడు. చిరు ఈ సినిమా గురించి చెప్పగానే, తాను మరో ఆలోచన చేయకుండానే ఓకే చెప్పానన్నాడు. మీ వెనకాల నిల్చోడానికి కూడా నేను సిద్ధమేనని అన్నానని, నీకు మంచి పాత్రే ఇస్తానని చిరు చెప్పారని.. ఆయన చెప్పినట్టుగానే తనకు ఈ సినిమాలో మంచి రోల్ ఇచ్చారని సల్మాన్ తెలిపాడు. ఈ చిత్రంలో తానో కొత్త పాత్ర చేశానన్న సల్మాన్.. మల్టీస్టారర్లు చేయడానికి కూడా సిద్ధమేనన్నాడు.
ఇదే సమయంలో సల్మాన్.. తనకు, చిరుకి మధ్య ఉన్న బాండింగ్ గురించి చెప్తూ, ‘కాస్టింగ్ కౌచ్’ని వాడుకున్నాడు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉండదని ఎవరు చెప్పారు.. కాస్టింగ్ కౌచ్ ముమ్మాటికీ ఉందని అన్నాడు. అందుకు తన స్టోరీనే ఉదాహరణగా తెలిపాడు. థాయిలాండ్‌లో తాము ఒక కమర్షియల్ యాడ్ చేసిన తర్వాత ముంబైకి తిరిగొచ్చామని.. చిరంజీవికి ఉదయం హైదరాబాద్‌కి ఫ్లైట్ ఉండటంతో కాసేపు కూర్చొని మాట్లాడుకున్నామని చెప్పాడు. అనంతరం తన బెడ్‌రూంలో వెళ్లి పడుకోమని తాను చిరుకి చెప్తే.. ఆయన మాత్రం కౌచ్ మీదే నిద్రపోతానని పట్టుపట్టారని అన్నాడు. నిజానికి.. తనకు కౌచ్ మీద పడుకోవాలని ఉన్నప్పటికీ, చిరు మాటని కాదనలేక సరేనన్నానని తెలిపాడు. అలా తాను బెడ్‌రూంకి వెళ్లి నిద్రపోగా.. చిరు కౌచ్‌పై పడుకున్నారని అన్నాడు. అలా నేను ఈ సినిమాలో భాగమయ్యానంటూ సల్మాన్ సరదాగా చెప్పుకొచ్చాడు. జనాలు ఇప్పుడు సినిమాల్ని నార్త్, సౌత్ అని తేడా లేకుండా చూస్తున్నారన్నాడు. గాడ్‌ఫాదర్ తన తొలి తెలుగు సినిమా అని పేర్కొన్న సల్మాన్.. ఇది కచ్ఛితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్మకంగా చెప్పాడు.
ఇక ఈ ఈవెంట్‌లోనే చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘గాడ్‌ఫాదర్‌లో ఒక బలమైన పాత్ర వుంది. లూసిఫర్‌లో ఆ పాత్రని పృథ్వీరాజ్ సుకుమారన్ చేశారు. గాడ్‌ఫాదర్‌లో ఈ పాత్రని సల్మాన్ భాయ్ చేస్తే బావుంటుందని భావించాం. మేము కోరగానే ‘నేను చేయాలని మీరు కోరినట్లయితే, మరో ఆలోచన లేకుండా చేస్తాను. మీరు ఇంకెం అలోచించకండి. నేను చేస్తాను’ అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. సల్మాన్ భాయ్ ఓకే చేసిన తర్వాత ఈ సినిమా మరింత ప్రత్యేకత వచ్చిపడింది. షూటింగ్‌లో మాకు ఎంతగానో సహకరించారు. సల్మాన్ భాయ్ గాడ్ ఫాదర్‌లోకి రావడం.. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు. మాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతతో ఈ సినిమా చేశారు. సల్మాన్ భాయ్‌తో కలసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ గా చేశాను. ఆ జోష్‌ని తెరపై చూస్తారు’’ అంటూ చెప్పుకొచ్చారు.