బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన సల్మాన్ ఖాన్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0 లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుందని తెలిపారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
I have accepted #GreenindiaChallenge from @MPsantoshtrs garu and I have planted saplings at Ramoji Film City . I request all my fans to perticapate in this challenge to control global warming… pic.twitter.com/JXND8Gk4VY
— Salman Khan (@BeingSalmanKhan) June 22, 2022
దేశవ్యాప్తంగా అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమని సల్మాన్ ఖాన్ అన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని.. ఆ పనికి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా బాటలు వేశారన్నారు. దాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. తన అభిమానులంతా విధిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
అనంతరం రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. పెద్ద మనసుతో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే.. వచ్చి మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సల్మాన్ ఖాన్ మొక్కలు నాటడం వల్ల కోట్లాది మంది అభిమానులకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.