సల్మాన్ ఖాన్ ‘ద-బాంగ్’ టూర్ కోసం కొన్ని రోజుల క్రితం రియాద్‌కు బయలు దేరాడు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ తారలు ప్రదర్శనలు ఇస్తారు. ఈ పర్యటన ఈరోజు ప్రారంభం కానుంది. ఈ లైవ్ కాన్సర్ట్‌లో అంతర్జాతీయ వేదికపై సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖ తారలు కనిపిస్తారు. సల్మాన్ సన్నిహితురాలు, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈ పర్యటనలో చేరనున్నారు. అయితే ఈ నటి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ మధ్యలో ఉంది. గత వారంలో జాక్వెలిన్‌ను ఈడీ విచారణ కోసం పిలిచింది. ఈ నేపథ్యంలో జాక్వెలిన్ పర్యటనలో పాల్గొనడం లేదని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జాక్వెలిన్ కూడా ఈ వేడుకలో భాగం కానుందని సల్మాన్ క్లారిటీ ఇచ్చారు.
Read Also : ఇజ్రాయెల్ మాజీ ప్రధానితో హీరోయిన్ భేటీ… బహుమతిగా భగవద్గీత
రియాద్‌లో మాట్లాడిన సల్మాన్… జాక్వెలిన్ ఈ ఈవెంట్ లో తన డ్యాన్స్ బృందంతో చేరుతుందని వెల్లడించాడు. “ఆమె రేపు ఇక్కడ ఉంటుంది, లేదంటే జాక్వెలిన్ స్థానంలో నేనే డ్యాన్స్ చేస్తా” అని సల్మాన్ సరదాగా పేర్కొన్నాడు. కాగా 200 కోట్ల దోపిడీ కేసులో సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో జాక్వెలిన్ పేరు తెరపైకి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. సుఖేష్‌తో సంబంధం ఉన్న నటీమణులలో జాక్వెలిన్‌తో పాటు నోరా ఫతేహిని కూడా ఈడీ ప్రశ్నించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇక స్టార్ స్టడెడ్ రియాద్ టూర్‌లో శిల్పా శెట్టి, సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్, ప్రభుదేవా, సునీల్ గ్రోవర్, కమాల్ ఖాన్, మనీష్ పాల్, ఆయుష్ శర్మ కూడా ఉన్నారు.