శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈ సినిమా శుక్రవారం రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శర్వానంద్ క్లాప్ కొట్టగా అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ ”యస్.ఆర్ కల్యాణ మండపం’ తర్వాత శంకర్ పిక్చర్స్ తో కలసి దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న సినిమా ఇది. దర్శకుడు నవీన్ రెడ్డి చెప్పిన కథ వినగానే ‘బంపర్ ఆఫర్’ గుర్తుకు వచ్చింది. ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా టైటిల్ లోనే మాస్ కనిపిస్తోంది. సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసి ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. మంచి నటీనటులు, టెక్నిషియన్స్ తో పాటు మంచి కథతో తీస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది అంటున్నారు నిర్మాత. కాశీవిశ్వనాథ్, పోసాని, సప్తగిరి వంటి అనుభవజ్ఞులైన నటీనటులతో పాటు చక్కటి సాంకేతిక నిపుణులను నిర్మాతలు ఇచ్చారని దర్శకుడు నవీన్ రెడ్డి తెలిపాడు. తెలుగులో ఇదే తన తొలి సినిమా అని హీరోయిన్ చెప్పింది. ఈ ప్రారంభోత్సవంలో ఆకాష్ పూరి, నిర్మాత కోడి దివ్య దీప్తి కూడా పాల్గొన్నారు.