గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా లో సాయి పల్లవి పేరు మోత మ్రోగిపోతుంది. ‘విరాట పర్వం’ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. అందుకు అనెను చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి, గో రక్షకుల గురించి ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా ఈ వ్యాఖ్యలపై సాయి పల్లవి స్పందించింది. ‘విరాట పర్వం’ ప్రమోషన్స్ లో భాగంగా నేడు విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె క్లారిటీ ఇచ్చింది.
మీరు యూట్యూబ్ ఛానెల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా ఇచ్చారు.. దానిపై మీ స్పందన ఏంటి అని అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి మాట్లాడుతూ ” నా మీద ఉన్న ప్రేమతో, నన్ను కాపాడడానికి మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారని అర్థమైంది. అభిమానులు కూడా నన్ను సేవ్ చేయడానికి ట్రోల్స్ కు కామెంట్స్ కూడా ఇస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు. సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాం. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా.. అదేదో సినిమా ప్రమోషన్ కోసం చేశానని, చెప్పానని అనుకుంటారు. దానికి ఒక సమయం ఉంటుంది.. అది నేను చెప్తాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.