ఒకే కుటుంబానికి చెందిన హీరోలు ఒకే హీరోయిన్‌తో జోడీ కట్టడాన్ని ఈమధ్య తరచూ చూస్తూనే ఉన్నాం. కొందరు భామలైతే రెండు తరాల హీరోలతోనూ (తండ్రి, తనయులు) జత కట్టేశారు. లేటెస్ట్‌గా వస్తోన్న భామలు మాత్రం యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తున్నారు. నాగ చైతన్య, అఖిల్ ఒకే హీరోయిన్‌తో బ్యాక్ టు బ్యాక్ జత కట్టడాన్ని మనం చూశాం. ఇప్పుడు మెగా వారసులూ అదే పని చేయబోతున్నారు. తమ్ముడ వైష్ణవ్‌తో జోడీ కట్టిన హీరోయిన్‌తో రొమాన్స్ చేసేందుకు సాయి ధరమ్ తేజ్ సిద్ధమవుతున్నాడని సమాచారం.
యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ తన స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాల్ని లైన్‌లో పెడుతున్నాడు. వాటిల్లో తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించబోతున్న వినోదయ సీతం రీమేక్ ఒకటి. ఇందులో తేజ్ సరసన కథానాయిక పాత్ర కోసం కేతికా శర్మని ఎంపిక చేశారని తెలిసింది. ఈ అమ్మడు ఆల్రెడీ అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో కలిసి ‘రంగరంగ వైభవంగా’ సినిమాలో నటించింది. ఇది రిలీజ్‌కి ముస్తాబవుతోంది. ఇప్పుడు అతని అన్నయ్య తేజ్‌తో వెండితెరపై రొమాన్స్ చేసేందుకు ఆ బ్యూటీ రెడీ అవుతోంది. నిజానికి.. కేతికా శర్మకు తెలుగులో ఇంతవరకూ సరైన హిట్ పడలేదు. అయినా ఆఫర్లు వస్తుండటానికి కారణం.. ఆమె అందాలే!
తన అందాలతో యువతకు వల వేసి క్రేజ్ సంపాదించడంతో, ఇండస్ట్రీలో సినిమా ఆఫర్లు ఒకదాని తర్వాత మరొకటి వస్తున్నాయి. ప్రస్తుతం రంగరంగ వైభవంగా సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. ఇందులో మరీ గ్లామర్ రోల్ కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్ర పోషించింది కాబట్టి తనకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తోంది. ఈలోపే తేజ్ సరసన నటించే ఛాన్స్ కొట్టడం నిజంగా బంపరాఫరే! ఎందుకంటే, ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడుగా!