RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం గత సంవత్సరం అత్యధిక వసూళ్ళు చూసిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచీ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు సొంతం చేసుకుంటూ సాగుతోంది. ఈనెల 25వ తేదీ తెల్లవారుజామున ‘ఆస్కార్ నామినేషన్స్’ ప్రకటన వెలువడుతుంది. ఈ నేపథ్యంలో ‘ట్రిపుల్ ఆర్’ ఏ యే కేటగిరీల్లో నామినేషన్స్ సంపాదిస్తుందో అన్న ఆసక్తి తేదీ దగ్గర పడే కొద్దీ భారతీయ సినిమా అభిమానుల్లో అధికమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం కొన్ని ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకోవడం వల్లే ఈ ఆసక్తి అధికమవుతోందని చెప్పవచ్చు.
ఇప్పటి దాకా ‘ట్రిపుల్ ఆర్’ సొంతం చేసుకున్న ఇంటర్నేషనల్ అవార్డులు ఏవో గుర్తు చేసుకుందాం. పలు అంతర్జాతీయ వేదికలపై ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం 71 నామినేషన్లు సంపాదించింది. వాటిలో 20 అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం! ఓ ఇండియన్ మూవీ, అందునా తెలుగు సినిమా ఇన్ని ఇంటర్నేషనల్ అవార్డులు అందుకోవడం ఇదే మొదటి సారి. ‘ఉటా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ ఈ చిత్రాన్ని ‘బెస్ట్ నాన్ ఇంగ్లిష్ సినిమా’గా ఎంపిక చేసింది. ‘సౌత్ ఈస్టరన్ ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్’ ఈ సినిమాను ‘బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ మూవీ’గా ఎన్నుకుంది. శాటర్న్ అవార్డ్స్ లోనూ ‘ట్రిపుల్ ఆర్’ చిత్రానికి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్’ అవార్డు కైవసం చేసుకుంది. ‘న్యూ యార్క్ ఫిలిమ్ క్రిటిక్స్ సర్కిల్’ దర్శకుడు రాజమౌళిని ‘బెస్ట్ డైరెక్టర్’గా ఎంపిక చేసింది. ‘లాస్ ఏంజెలిస్ ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్’ ఈ సినిమాతో కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకునిగా పట్టం కట్టింది. ‘జార్జియా ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్’ ఈ సినిమాను ‘బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ’ అవార్డుతో సత్కరించింది. ‘క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్’లో ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిమ్’గానూ, ఇందులోని “నాటు నాటు…” పాటతో బెస్ట్ సాంగ్ అవార్డునూ సొంతం చేసుకుంది ‘ట్రిపుల్ ఆర్’. ‘బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిలిమ్ క్రిటిక్స్’ అవార్డుల్లో కీరవాణి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో అవార్డు అందుకున్నారు. ‘అట్లాంటా ఫిలిమ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డుల్లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ’గా ‘ట్రిపుల్ ఆర్’ ఎంపికైంది. ‘అలయన్స్ ఆఫ్ విమెన్ ఫిలిమ్ జర్నలిస్ట్స్’ ఈ చిత్రాన్ని ‘బెస్ట్ నాన్ ఇంగ్లిష్ మూవీ’గా ఎన్నుకుంది. ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’లో ఈ సినిమాలోని “నాటు నాటు…” పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’గా అవార్డు సొంతం చేసుకుంది.
Read Also: Unstoppable 2: రొటీన్ టీజర్ అయినా భారీ వ్యూస్
అనేక అంతర్జాతీయ వేదికలపై ‘బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’, ‘బెస్ట్ డైరెక్టర్’ విభాగాల్లో నామినేషన్లు సంపాదించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ‘ఆస్టిన్ ఫిలిమ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డుల్లో మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అక్కడ ఈ సినిమా ఫైట్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ కు ‘బెస్ట్ స్టంట్ కో ఆర్డినేటర్’ అవార్డు లభించింది. ఈ అవార్డుల్లో ఒక్క ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డులను మినహాయిస్తే, మిగిలినవన్నీ అంత ప్రాధాన్యమున్న అవార్డులు కావని మన దేశంలోని సినీ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అసలైన అంతర్జాతీయ అవార్డులుగా జేజేలు అందుకొనే ‘ఆస్కార్’, ‘గ్రామీ’, ‘ఎమ్మీ’, ‘టోనీ’ అవార్డుల ప్రదానోత్సవాలు ఇకపై సాగనున్నాయి. వాటిలో జనవరి 24న ఆస్కార్ నామినేషన్ల ప్రకటన వస్తుంది. జూలై 12న ‘ఎమ్మీ అవార్డ్స్’ నామినేషన్స్ వెలువరిస్తారు. సంగీతానికి పట్టం కట్టే ‘గ్రామీ అవార్డులు’ ఫిబ్రవరి 5న (మన దేశ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 6 తెల్లవారు జామున) ప్రదానోత్సవం సాగనుంది. జూన్ 11న టోనీ అవార్డ్స్ ప్రకటిస్తారు. ఎన్ని వేదికలు ఎంతగా తమ గొప్పదనాన్ని చాటుకున్నా, ప్రపంచ వ్యాప్తంగా సినీఫ్యాన్స్ మదిలో ‘ఆస్కార్ అవార్డుల’కున్న స్థానం దేనికీ లేదనే చెప్పాలి. అందువల్ల మరికొద్ది రోజుల్లో ప్రకటించే ‘ఆస్కార్ నామినేషన్స్’పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో ప్రతిష్ఠాత్మక అవార్డులు ‘బ్రిటిష్ అకాడమీ ఫిలిమ్ అవార్డులు’ నామినేషన్స్ ప్రకటించారు. అందులో ‘ట్రిపుల్ ఆర్’కు ఏ విభాగంలోనూ చోటు దక్కలేదు. అందువల్ల మన వాళ్ళ ఆశలన్నీ ప్రస్తుతం ‘ఆస్కార్’పైనే ఉన్నాయి. తప్పకుండా “నాటు నాటు…” పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కుతుందని ఆశిస్తున్నారు.