అసలే “బాయ్కాట్ బాలీవుడ్”(#BoycottBollywood) ట్రెండ్ దెబ్బకి కుదేలైన హిందీ చిత్ర పరిశ్రమకి కొత్త తల నొప్పి తెచ్చిపెట్టింది హీరోయిన్ రిచా చద్దా(Richa Chadda). గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, ఫుక్రే, షకీలా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ పంజాబీ అమ్మాయి… ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ చేసిన కామెంట్స్ కి వివాదాస్పద రిప్లై ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పాకిస్థాన్ ని వెనక్కి పంపడానికి తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తే, ఆపరేషన్ ని త్వరగా ముగిస్తాము అంటూ నార్తన్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ ఇటివలే మాట్లాడారు. ఈ మాటలకి రిచా చద్దా “Galwan Says Hi” అంటూ ట్వీట్ చేసింది. ఇండో చైనా మధ్య జరిగిన గాల్వాన్ ఇష్యూలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల త్యాగాన్ని మర్చిపోయి, పాకిస్థాన్ ని మద్దతునిచ్చేలా రిచా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
రిచా చద్దా ట్వీట్ చూసిన వాళ్లు ఆమెపై మండి పడుతున్నారు. హిందీ చిత్ర పరిశ్రమ ఇలాంటి వాళ్లని ఎలా ఎంకరేజ్ చేస్తుందో అంటూ విమర్శలు చేస్తున్నారు. రిచా చద్దా నటించిన ‘ఫుక్రే 3’ సినిమా విడుదలకి సిద్దమవుతోంది, దీంతో రిలీజ్ సమయంలో నీ పని చూస్తాం అంటూ కొందరు వార్నింగ్స్ కూడా ఇచ్చారు. దీంతో దిగొచ్చిన రిచా చద్ద, తన ట్వీట్ ని డిలీట్ చేసి క్షమాపణ కోరింది. ఒక నోట్ పోస్ట్ చేసిన రిచా ‘తాను ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చానని, వాళ్ల తాతయ్య ఇండో చైనా యుద్ధంలో(1960) పాల్గొన్నాడని… అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన తను ఎవరి మనోభావాలని దెబ్బ తీయాలని అలా ట్వీట్ చేయలేదని, ఒకవేళ ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని’ కోరింది. రిచా క్షమాపణలు అయితే కోరింది కానీ దాన్ని పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.