ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడిల్ కు క్రేజ్ వారం వారం పెరిగిపోతోంది. మొత్తం పన్నెండు మంది ఫైనలిస్టుల్లో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన పదిమందికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. దాంతో న్యాయనిర్ణేతలు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మొదలెట్టారు. అదే సమయంలో ప్రాంక్ చేస్తూ, కంటెస్టెంట్స్ కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తున్నారు. శుక్రవారం ఐదుగురు కంటెస్టెంట్స్ పాల్గొనగా, శనివారం మిగిలిన ఐదుగురు పాత సినిమా పాటలతో ఆకట్టుకున్నారు. ఇందులో ఇద్దరు మణిరత్నం ‘గీతాంజలి’ సినిమాలోని పాటలను పాడగా, మరొకరు మణిరత్నం ‘దొంగ దొంగ’లోని పాట పాడారు. మిగిలిన ఇద్దరూ వంశీ ‘ఏప్రిల్ 1 విడుదల’లోని గీతాన్ని, సింగీతం శ్రీనివాసరావు ‘ఆదిత్య 369’లోని పాటను పాడారు.
శుక్రవారం చెక్క గుర్రాన్ని వేదిక మీదకు తీసుకొచ్చిన హోస్ట్ శ్రీరామచంద్ర… శనివారం సైకిల్ వెనుక నిత్యామీనన్ ను ఎక్కించుకుని స్టేజ్ మీద చక్కర్లు కొట్టాడు. తీరా చూస్తే దానిని ఓ డ్రీమ్ గా చూపించారు. తన కల ఎప్పటికైనా నిజం అవుతుందని నమ్ముతున్నానంటూ సరదాగా ఈ ఎపిసోడ్ ను శ్రీరామచంద్ర ప్రారంభించాడు. ఇక శనివారం మొదటగా ప్రణతి ‘గీతాంజలి’లోని ‘జల్లంత కవ్వింత కావాలిలే… ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే’ గీతాన్ని పాడింది. అయితే ఇళయరాజా స్వరాలకు సొంత రాగాలూ చేర్చడం అస్సలు ఏ మాత్రం బాలేదని ముగ్గురు న్యాయనిర్ణేతలు అనేయడంతో ప్రణతి కంగుతింది. కన్నీళ్ళు పెట్టుకుంది. అదే సమయంలో ఇదంతా ప్రాంక్ అంటూ నిత్యామీనన్ చెప్పేయడంతో ఊపిరి పీల్చుకుంది. ఆమెది బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ అభినందించారు న్యాయనిర్ణేతలు. అంతకు మించి అన్నట్టుగా ‘గీతాంజలి’ మూవీలోని ఓ సన్నివేశాన్ని ప్రణతి… మరో కంటెస్టెంట్ జయంత్ తో కలిసి రీ-క్రియేట్ చేసింది. బిర్యానీ తనకు ఉంచకుండా తీసేశారంటూ ఆరోపించడంతో వేదికపై నవ్వుల పువ్వులు పూశాయి. ఈ సందర్భంగా ప్రణతి ట్రైనర్ నిహాల్ ను కూడా జడ్జీలు అభినందించారు.
సెకెండ్ కంటెస్టెంట్ మారుతి ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమాలోని ‘చుక్కలు తెమ్మన్నా తీసుకురానా’ పాటను పాడాడు. అయితే అది జస్ట్ ఓకేలా ఉందని, అప్ టూ ద మార్క్ లేదని జడ్జీలు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత వాగ్దేవి ‘దొంగ దొంగ’ సినిమాలోని ‘కొంచె నీరు కొంచెం నిప్పు’ పాట పాడింది. ఆమెది బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అంటూ కితాబిచ్చారు జడ్జీలు. ఆ తర్వాత తిరుపతి నుండి వచ్చిన మాన్య ‘ఆదిత్య 369’లోని ‘జాణవులే… నెర జాణవులే’ పాటను పాడింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో పూజారిగా పనిచేస్తున్న తన తండ్రికి వారసత్వంగా లభించిన ఆ పూజాది కార్యక్రమాలను ముగ్గురూ ఆడపిల్లలు అయిన కారణంగా తాము కొనసాగించలేక పోతున్నామని వాపోయింది మాన్య. అయితే వేంకటేశ్వరుని సన్నిధిలో తనతో పాటలు పాడించాలన్నది తన తండ్రి కోరిక అని తెలిపింది. ఆ తర్వాత అదితి భావరాజు ‘గీతాంజలి’ మూవీలోని ‘రోజాలో లేత వన్నెలే’ పాటను పాడి ఆకట్టుకుంది. ఆమెను కూడా తొలుత ప్రాంక్ చేసి ఏడిపించిన జడ్జీలు ఆ తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ ఫెర్ఫార్మెన్స్ అంటూ మెచ్చుకోవడంతో కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. యోగా చేయడం తనకు ఇష్టమని అదితి చెప్పడంతో మారుతితో కొన్ని యోగాసనాలను చేయించారు. ఇక ఎపిసోడ్ చివరగా ‘గీతాంజలి’లోని పాటను శ్రీరామచంద్ర, కార్తీక్ పాడి… మణిరత్నం, ఇళయరాజా మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ రెట్రో స్పెషల్ ఎపిసోడ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా అదితి భావరాజు గిఫ్ట్ హ్యాంపర్ అందుకుంది.